Viral Story : తాత భూమి కోసం తిప్పలు.. చివరికి AIనే పట్టిచ్చింది ఇలా.!

Viral Story : కృత్రిమ మేధస్సు (AI) అనగానే చాట్‌బాట్‌లు, కోడింగ్ ఇంకా ఆఫీస్ పనులకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఏఐ సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే..

G Krishna
Published on: 28 May 2026 1:41 PM IST
AI helped a UP man
X

AI helped a UP man

Viral Story : కృత్రిమ మేధస్సు (AI) అనగానే చాట్‌బాట్‌లు, కోడింగ్ ఇంకా ఆఫీస్ పనులకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఏఐ సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే మన నిత్యజీవితంలో దశాబ్దాలుగా నలుగుతున్న వ్యక్తిగత సమస్యలను కూడా చిటికెలో పరిష్కరించుకోవచ్చని నిరూపించాడు జహీద్ ఖాన్ అనే వ్యక్తి. ఉత్తరప్రదేశ్‌లోని తన తాతల నాటి పూర్వీకుల భూమిని కనుగొనడానికి అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించిన విధానం, దానికి సంబంధించిన వివరాలను లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా పంచుకోవడంతో ఈ సంచలన ఉదంతం కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

గూగుల్ మ్యాప్స్‌లోనూ దొరకని భూమి..

జహీద్ ఖాన్ వివరించిన వివరాల ప్రకారం, ఆ భూమి వారి ముత్తాత నుండి తాతకు, అక్కడి నుండి తండ్రికి, ఆపై అతనికి వారసత్వంగా సంక్రమించింది. అయితే ఆ భూమి ఉత్తరప్రదేశ్‌లోని మహ్మద్‌పూర్ అనే గ్రామీణ ప్రాంతంలో ఉండటం, జహీద్ తన జీవితంలో కేవలం కొన్ని సార్లు మాత్రమే ఆ ఊరికి వెళ్లడం వల్ల ఆ భూమి సరిగ్గా ఎక్కడుందో వెతకడం అతనికి అసాధ్యంగా మారింది. ఆ గ్రామానికి సంబంధించిన భూ రికార్డులను ప్రభుత్వం డిజిటలైజ్ చేసినప్పటికీ, వాటిని సేకరించడం అంత సులభం కాలేదు. ఎందుకంటే ఆ భూమికి సంబంధించిన వివరాలు వేర్వేరు ప్రభుత్వ పోర్టల్స్‌లో చెల్లాచెదురుగా ఉండటమే కాకుండా, సాధారణ ప్రజలకు అర్థం కాని అత్యంత కఠినమైన అధికారిక హిందీ భాషలో ఉన్నాయి. దీంతో స్వయంగా వెతకడం కష్టమని భావించిన జహీద్.. 'ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ' (Anthropic's Claude AI) అసిస్టెంట్‌ను రంగంలోకి దించాడు.

ఏఐ చేసిన అద్భుతమైన పరిశోధన

క్లాడ్ ఏఐ లోని లేటెస్ట్ 'కంప్యూటర్ యూజ్' (Computer Use) ఫీచర్‌ను జహీద్ ఉపయోగించుకున్నాడు. ఈ ఫీచర్ సాయంతో ఆ ఏఐ అసిస్టెంట్ స్వయంగా స్క్రీన్‌పై ఉన్న కీబోర్డ్ ద్వారా జహీద్ తండ్రి పేరును హిందీలో టైప్ చేసి ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్ వెబ్‌సైట్లలో వెతకడం ప్రారంభించింది. జహీద్ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్క భూమిని గుర్తించడమే కాకుండా, ప్రభుత్వ డేటాబేస్ నుండి వాటికి సంబంధించిన 'గాటా సంఖ్య' (ప్లాట్ నంబర్లు) మొత్తాన్ని విజయవంతంగా సేకరించింది. ఆ తర్వాత మరింత లోతుగా పరిశోధన చేసిన ఏఐ.. ప్రభుత్వ మ్యాపింగ్ పోర్టల్‌లోకి ప్రవేశించి ఆ ప్లాట్ల సరిహద్దుల కొలతలను విశ్లేషించింది. ఆ వెబ్‌సైట్‌లో ఉన్న కోఆర్డినేట్స్ సాధారణ లాంగిట్యూడ్ ఫార్మాట్‌లో కాకుండా క్లిష్టమైన యూటీఎం (UTM) ఫార్మాట్‌లో ఉన్నాయని గుర్తించిన ఏఐ, స్వయంగా ఒక సరికొత్త టూల్‌ను క్రియేట్ చేసి మొత్తం 25 ప్లాట్ల సరిహద్దు కొలతలను ఖచ్చితత్వంతో లెక్కగట్టింది.

లింక్డ్‌ఇన్ యూజర్ల ప్రశంసల జల్లు

ఇలా సేకరించిన అత్యంత సంక్లిష్టమైన కొలతల డేటాను క్లాడ్ ఏఐ సాధారణ మ్యాప్ లొకేషన్లుగా మార్చి, ఒక కెఎమ్‌ఎల్ (KML) ఫైల్‌ను సృష్టించింది. ఆ ఫైల్‌ను గూగుల్ మై మ్యాప్స్ (Google My Maps) లో అప్‌లోడ్ చేయడంతో, జహీద్ ఖాన్‌కు తన పూర్వీకుల భూమికి సంబంధించిన స్పష్టమైన సరిహద్దుల మ్యాప్ కళ్లముందు సాక్షాత్కరించింది. ఈ ప్రయోగం చేస్తున్న క్రమంలో తాను ఏఐ ఉచిత వెర్షన్ నుండి ప్రో , మ్యాక్స్ సబ్‌స్క్రిప్షన్ల వరకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి వచ్చిందని జహీద్ సరదాగా చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ఏఐ వల్ల జరిగిన నిజమైన ఉపయోగం ఇదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ రిజిస్ట్రార్ వెబ్‌సైట్లలో ఇలాంటి ఏఐ ఏజెంట్లను అధికారికంగా ప్రవేశపెడితే సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story