Viral News: ఒంటికాలితోనే బడికి.. ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరల్‌గా మారిన 7 ఏళ్ల రాగిణి స్ఫూర్తిదాయక ప్రయాణం!
Viral News: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒంటికాలితో అరకిలోమీటర్ నడుస్తూ బడికి వెళ్తున్న 7 ఏళ్ల చిన్నారి రాగిణి కథ వైరల్.
Viral News: ఒంటికాలితోనే బడికి.. ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరల్‌గా మారిన 7 ఏళ్ల రాగిణి స్ఫూర్తిదాయక ప్రయాణం!
Viral News: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లా రాణీపూర్‌కు చెందిన 7 ఏళ్ల చిన్నారి రాగిణి ఆత్మస్థైర్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నతనంలో జరిగిన ప్రమాదం కారణంగా ఓ కాలు కోల్పోయినా, చదువుపై ఆమెకు ఉన్న మమకారం ఎవరినైనా కదిలిస్తుంది. తోటి పిల్లలు సంతోషంగా బడికి వెళ్తుంటే చూస్తూ కూర్చోకుండా, తానూ బడికి వెళ్తానని పట్టుబట్టిన ఆ చిన్నారి.. రోజూ ఇంటి నుంచి దాదాపు అర కిలోమీటరు దూరం ఉన్న పాఠశాలకు ఒంటికాలితోనే గెంతుకుంటూ వెళ్తోంది.
రాగిణి తండ్రి ఒక సాధారణ దినకూలీ. కేవలం ఆరు నెలల వయసులో జరిగిన ఒక ప్రమాదంలో రాగిణి కాలు తీవ్రంగా గాయపడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించినప్పటికీ మెరుగైన చికిత్స అందించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకొచ్చేశారు. అయినప్పటికీ పట్టుదల వీడని రాగిణి, ప్రస్తుతం స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతూ అక్షరాల బాట పట్టింది.
ఒంటికాలితో బడికి వెళ్తున్న రాగిణి పట్టుదల గురించిన కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ప్రముఖులు స్పందించారు. ఆప్ (AAP) ఎంపీ సంజయ్‌సింగ్ ఈ ఘటనపై స్పందించి, చిన్నారికి తక్షణ సహాయంగా ట్రైసైకిలు అందజేశారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి రూ.26,500 ఆర్థిక సాయం అందించి, వీడియో కాల్ ద్వారా రాగిణితో మాట్లాడి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మరోవైపు, బలియా జిల్లా కలెక్టర్ మంగళ ప్రసాద్ సింగ్ స్వయంగా రాగిణి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. చిన్నారి చదువుతో పాటు ఆమె కాలికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు, శారీరక వైకల్యం ఏదీ విద్యకు అడ్డంకి కాదని నిరూపిస్తున్న రాగిణి ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.




