Siddipet: బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్ హైమావతి!
Siddipet: బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు.
Siddipet: బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్ హైమావతి!
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమలుపై సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా సర్పంచులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఫంక్షన్ హాళ్లు, దేవాలయాల్లో వివాహాల నిర్వహణ సందర్భంగా వధూవరుల వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించేలా చర్యలు చేపట్టాలని డీపీఓను ఆదేశించారు. గ్రామ స్థాయిలో బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీపీలు, సర్పంచులు సమన్వయంతో పనిచేస్తూ బాల్య వివాహాల నిరోధానికి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు.
పాఠశాలల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కాకపోతే, వారు ఎందుకు పాఠశాలకు రావడం లేదనే విషయాన్ని పాఠశాల ఉపాద్యాయులు పర్యవేక్షించాలని డిఈఓ కు సూచించారు. బాల్య వివాహాలకు ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణంగా ఉన్నందున, కుటుంబాలకు ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించే దిశగా సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలని సూచించారు.
బాల్య వివాహాలపై సత్వర చర్యలు చేపట్టేందుకు గ్రామ స్థాయిలో కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేసి బాల్య వివాహాలను అడ్డుకున్నప్పుడే చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయగలమని కలెక్టర్ అన్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మంగళ, గురువారాల్లో నిర్వహించే శానిటేషన్ డ్రైవ్‌ల సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో బాల్య వివాహాల నిరోధక చట్టం–2006తో పాటు పిల్లలకు కల్పించిన హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.




