Gajwel: గజ్వేల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు నిరసన!
Gajwel: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ గజ్వేల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
Gajwel: గజ్వేల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు నిరసన!
Gajwel: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల అసమర్థ పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ యాదవ్‌రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మాదాసు శ్రీనివాస్‌లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ ప్రాజెక్టులను ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పటివరకు సందర్శించలేదని ఆరోపించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి నీటితో నింపామని, కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా కాల్వలు, సాగునీటి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.రెవెన్యూ శాఖలో 22ఏ నిబంధన పేరుతో రైతులు తమ భూములను విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. వైద్య ఖర్చులు, వివాహాలు తదితర అత్యవసర అవసరాల కోసం భూములు విక్రయించాలన్నా రిజిస్ట్రేషన్ల సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.
గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా వైద్య సేవలు దారుణంగా మారాయని విమర్శించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మోడల్‌గా అభివృద్ధి చేసిన గజ్వేల్‌ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో గ్యాదరి బాలమల్లు, మాజీ జెడ్పీటీసీ చైర్మన్ రోజా రాధాక్రిష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ నేతి చిన రాజమౌళి, మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్మన్ కళ్యాణాకర్ పద్మాబాయి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




