Rajahmundry: మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమే!
Rajahmundry: మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు.
Rajahmundry: మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమే!
Rajahmundry: మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, నిరసనలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 16 వేల డీఎస్సీ పోస్టులను పూర్తి పారదర్శకతతో భర్తీ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు.
తిలక్ రోడ్డులోని రెడ్డీస్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. మెగా డీఎస్సీపై వైసీపీ చేపడుతున్న నిరసనల్లో అసలు విద్యార్థులు కనిపించడం లేదని, రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్నవారే ఎక్కువగా పాల్గొంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనలకు, రాష్ట్రంలో వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ డీఎస్సీపై అసత్య ప్రచారం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి అవకతవకలు లేకుండా, పూర్తి పారదర్శకతతో 16 వేల మెగా డీఎస్సీ నియామకాలను పూర్తి చేసిందని చెప్పారు. ఈ ప్రక్రియకు మంత్రి నారా లోకేష్ నాయకత్వం వహించారని, ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువతను మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు డీఎస్సీపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ ఆధారాలతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ పలుమార్లు బహిరంగ చర్చకు ఆహ్వానించినా జగన్ స్పందించలేదన్నారు. తప్పులు జరిగాయని నిరూపిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కానీ ఒక్క అభ్యర్థి కూడా తనకు అన్యాయం జరిగిందని ముందుకు రాకపోవడం వైసీపీ ఆరోపణలు నిరాధారమని రుజువు చేస్తోందన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన 16 వేల మంది అభ్యర్థులు వైసీపీ ఆరోపణలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని తెలిపారు.
ఐదేళ్లు అవకాశం ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు తాము కష్టపడి సాధించిన ఉద్యోగాలను కూడా అపవాదులు వేయడం బాధాకరమని అభ్యర్థులు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి ఏడాది ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగుతుందని, మరో డీఎస్సీ కూడా నిర్వహిస్తామని గుర్తు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ ప్రతి అంశాన్ని కోర్టులకు తీసుకెళ్లి అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో బాధితులను కాకుండా నేరాలకు పాల్పడిన వారినే పరామర్శించడం జగన్ రాజకీయ వైఖరికి నిదర్శనమన్నారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతేనని, రాజమహేంద్రవరం నగరంలో రౌడీయిజం, గుండాయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. అవసరమైతే రౌడీషీట్లు, పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సీఎం సహాయనిధి రాష్ట్ర ప్రజలకు సంజీవనిలా మారిందన్నారు.
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే 686 మందికి రూ.5,69,91,934 విలువైన చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. శుక్రవారం మరో 48 చెక్కులు, 5 ఎల్‌వోసీలు కలిపి రూ.61,10,165 విలువైన సాయం అందించామని చెప్పారు. దీంతో మొత్తం 739 మంది లబ్ధిదారులకు రూ.6,31,02,099 ఆర్థిక సాయం అందిందన్నారు. మరో 94 దరఖాస్తులు సుమారు రూ.1.70 కోట్ల విలువతో సీఎం కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ స్థాయిలో సీఎం సహాయనిధి చెక్కులు తీసుకొచ్చారా అని బహిరంగ సవాల్ విసిరారు.
మోరంపూడి ఫ్లైఓవర్ సమస్యపై కూడా స్పందిస్తూ, గత కాంట్రాక్టర్ ఆర్థిక సమస్యలతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కృషితో నేషనల్ హైవేస్ అథారిటీ కొత్త టెండర్లు పూర్తి చేసిందని, విజయలక్ష్మి ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పీకి పనులు అప్పగించారని చెప్పారు. ఆగస్టు 15 నుంచి 20 మధ్య ఫ్లైఓవర్ ఇరువైపులా రోడ్ల మరమ్మత్తులు, శాశ్వత పరిష్కార పనులు ప్రారంభమవుతాయని అధికారిక సమాచారం అందిందన్నారు.
ఇది కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందనే విషయానికి నిదర్శనమన్నారు. రాజమహేంద్రవరం నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్, గెయిల్, ఓఎన్‌జీసీ తదితర శాఖల పనుల కారణంగా రోడ్లు తవ్విన చోట్ల వెంటనే పునరుద్ధరణ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా మీడియా కూడా సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని చెప్పారు.
ఏపీ పేపర్ మిల్లు యూనియన్ ఎన్నికలపై స్పందిస్తూ అన్ని యూనియన్లు ఐక్యంగా పోటీ చేసి ఉంటే కార్మికులకు మరింత బలమైన ఒప్పందాలు సాధించే అవకాశం ఉండేదన్నారు. విడివిడిగా పోటీ చేయడం వల్ల మేనేజ్‌మెంట్‌కే లాభం జరిగిందన్నారు. టీఎన్‌టీయూసీ ఒక్కటే పోటీ చేసి 221 ఓట్లు సాధించడం ద్వారా తన బలాన్ని నిరూపించుకుందని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఎవరూ గెలవలేదని, చివరికి గెలిచింది మేనేజ్‌మెంట్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అన్ని 11 యూనియన్లు ఐక్యంగా పనిచేసి కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. చర్చల కమిటీలో తమ వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తామని చెప్పారు. అనంతరం అర్హులకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
మీడియా సమావేశంలో కూటమి నాయకులు నక్కా చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, బుడ్డిగ రవి, తురకల నిర్మల, ఉప్పులూరి జానకిరామయ్య, ద్వారా పార్వతి సుందరి, కంటిపూడి శ్రీను, కొయ్యల రమణ, కడలి రామకృష్ణ, కంటిపూడి రాజేంద్రప్రసాద్, మొకమాటి సత్యనారాయణ, కొడమళ్ల శ్రీను, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, కరగాని వేణు, అగురు ధన్‌రాజ్, మళ్ల వెంకటరాజు, జవ్వాది మురళి, కేలం శ్రీను, దాస్యం ప్రసాద్, చింతా జోగినాయుడు, శివారెడ్డి, చాపల చిన్నరాజు, సలాది ఆనంద్, శ్రీలత, కానేటి కృపామణి తదితరులు పాల్గొన్నారు.




