Razole: డంపింగ్ యార్డ్ పొగతో రాజోలు ఉక్కిరిబిక్కిరి.. శాశ్వత పరిష్కారం ఏది?

Razole: కోనసీమ జిల్లా రాజోలు కైలాస భూమి సమీపంలోని తాత్కాలిక డంపింగ్ యార్డ్‌లో చెత్త తగలబడి దట్టమైన విషపు పొగ వ్యాపిస్తోంది.

PRABHU, RAZOLE
Published on: 25 July 2026 5:23 PM IST
Razole
X

Razole: డంపింగ్ యార్డ్ పొగతో రాజోలు ఉక్కిరిబిక్కిరి.. శాశ్వత పరిష్కారం ఏది?

Razole: డాక్టర్ .బిఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు పంచాయితీ పరిధిలో కైలాస భూమి సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏటి గట్టు దిగువన ఏర్పాటు చేసిన తాత్కాలిక డంపింగ్ యార్డ్ ప్రస్తుతం ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి పెను ముప్పుగా మారుతోంది. డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్త నుంచి తరచూ మంటలు చెలరేగి, దట్టమైన పొగతో పాటు భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది.

దూరం నుంచి చూస్తే తెల్లటి పొగ మేఘాలు కాశ్మీర్ లోయల్లో కనిపించే హిమ జలపాతాలను తలపిస్తున్నా, దగ్గరకు వెళితే అది ప్రజల ఊపిరితిత్తులను కలుషితం చేస్తున్న విషపూరిత పొగ అని తెలుస్తోంది. ఈ పొగ కారణంగా సమీపంలోని పెట్రోల్ బంక్ సిబ్బంది, వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుండగా, జాతీయ రహదారిపై నిత్యం ప్రయాణించే వేలాది మంది వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రత్యేకించి వారంలో రెండు మూడు రోజులు ఏదో ఒక వేళల్లో పొగ మరింతగా వ్యాపించి పరిసర ప్రాంతాలను కమ్మేస్తోంది. దీంతో స్థానిక ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలు, కళ్ల మంటలు, దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంక్ సమీపంలో ఇలాంటి మంటలు చెలరేగడం భద్రతాపరంగా కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఈ విషయమై సంబంధిత పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా, డంపింగ్ యార్డ్‌లో చెత్త వేయడం వాస్తవమేనని, అయితే చెత్తకు తాము గానీ, తమ సిబ్బంది గానీ నిప్పు పెట్టడం లేదని తెలిపారు. చెత్త ఏరుకునే వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చని లేదా చెత్తలో స్వయంగా వేడి ఏర్పడి మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. సమస్యపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే ప్రజలు మాత్రం ఒక ప్రశ్న వేస్తున్నారు.. "మంటలు ఎవరు పెట్టారన్నది తర్వాత విషయం.. కానీ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న ఈ పొగకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?"

పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, రహదారి భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డంపింగ్ యార్డ్ నిర్వహణలో మెరుగైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, సామాజిక కార్యకర్తలు, ప్రయాణికులు కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story