Rajahmundry: మేయర్ సీటు ఆశిస్తున్నా.. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు!
Rajahmundry: రాజమండ్రిలో మేయర్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిపిన టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడ్డానని వెల్లడి.
Rajahmundry: మేయర్ సీటు ఆశిస్తున్నా.. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు!
Rajahmundry: తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని క్షేత్ర స్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నానని అందుకే మేయర్ టికెట్ ఆశిస్తున్నానని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు స్పష్టం చేసారు. గతంలో 6వ వార్డు కాంగ్రెస్ గెలిచేదని, తాను బాధ్యత తీసుకుని డాక్టర్ వాకా కృష్ణశ్రీని గెలిపించామని, ఆతర్వాత ఎన్నికల్లో తమ సోదరుని కుమార్తెను గెలిపించానని ఆయన గుర్తుచేసారు.
ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ మేయర్ టికెట్ గురించి అడిగినపుడు స్పందిస్తూ, వేరే పార్టీలోకి వెళ్లి రావడం, వీలుని బట్టి వ్యవహరించడం చేసేవారికి కాకుండా పార్టీని అంటిపెట్టుకుని పార్టీకోసం కష్టపడి పనిచేసినవారికే టికెట్ ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయమని ఆయన అన్నారు. తనకు అన్ని వర్గాలతో , కూటమి పార్టీలతో మంచి సమన్వయం ఉందని అందుకే బిసికి రిజర్వ్ అయితే తనకు టికెట్ ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు.
తనకు కాకుండా పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా చిత్తశుద్ధితో విజయం కోసం పనిచేస్తానని రాంబాబు స్ఫష్టంచేసారు. ఎస్సీకి రిజర్వ్ అయితే కాశీ నవీన్ కి టికెట్ దక్కే ఛాన్స్ ఉంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశానికే మేయర్ ఛాన్స్ వస్తుందని, ఒకవేళ సమీకరణల్లో కూటమిలో ఏపార్టీ అభ్యర్ధికి టికెట్ ఇచ్చినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి విజయం కోసం పనిచేయాలని ఇప్పటికే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టంగా సూచించారని అందుకు తాము కట్టుబడి ఉన్నామని రాంబాబు చెప్పారు.
అయితే గతంలో మాదిరిగా అభ్యర్థులను దిగుమతి చేసే విధానం ఇప్పుడు ఉండదని, అయినా గతంలో పరిస్థితులను బట్టి అలా చేయాల్సి వచ్చిందని, అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఆయన చెప్పారు.
గడిచిన రెండున్నరేళ్లలో 175 నియోజకవర్గాలలో చుస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంతో సమర్ధవంతంగా పని చేస్తున్నారని అన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలను కలుపుకుని నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని రాంబాబు చెప్పారు. లో ఓల్టేజి సమస్య పరిష్కారం కోసం 150ట్రాన్స్ ఫార్మర్లు వేయించారని, రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మూడు సబ్ స్టేషన్ల నిర్మాణం చేస్తున్నారని ఆయన చెప్పారు.
గతంలో వైసిపి ప్రభుత్వం ఉండగా ఏవో రెండుమూడు పనులు చేసి సోషల్ మీడియాలో షో చేసారని అయితే ఎమ్మెల్యే వాసు వచ్చాక ప్రజలకు ఏది అవసరమో ఆ పనులు చేస్తున్నారని ఆయన తెలిపారు. 350కోట్ల రూపాయల నిధులతో వివిధ పనులు చేపట్టారని ఆయన వివరించారు.
ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సహకారంతో కేంద్రం నుంచి నిధులు రాబట్టి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని రాంబాబు చెప్పారు. ముఖ్యంగా మురికివాడల్లోని పార్కులను కూడా సుందరీకరించారని ఆయన చెప్పారు. క్వారీ ఏరియాలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు, మల్టి పర్పస్ స్టేడియానికి శంకుస్థాపన, అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు చేపట్టడం ద్వారా ముంపు నివారణ చర్యలు చేపడుతున్నారని ఆయన వివరించారు.
పుష్కరాలకు ఎండోమెంట్స్ నిధులు తొలిదశలో 10కోట్లు, దశలో 4కోట్లు విడుదల అయ్యాయని ఆయన తెలిపారు. సిఎస్సార్ నిధులు రూ 8కోట్లతో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఒకపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క కూటమిలోని పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుని, వారిని సముచితంగా గౌరవిస్తూ, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా పనిచేస్తున్నారని అదే తాము కూడా ఆదర్శంగా తీసుకుని కూటమితో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నామని రాంబాబు స్పష్టంచేసారు.
మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, ద్వారా పార్వతి సుందరి, కడలి రామకృష్ణ, ఉప్పులూరి జానకిరామయ్య, కోరుమిల్లి విజయ శేఖర్, బుడ్డిగ రవి, శెట్టి జగదీశ్, దాస్యం ప్రసాద్, చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.




