Mamidikuduru: కోనసీమకు రైలు మార్గం నిర్మించాలని విద్యార్థుల నిరసన!
Mamidikuduru: కోనసీమకు రైలు మార్గం నిర్మించాలని డిమాండ్ చేస్తూ మామిడికుదురులో కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో దీప్తి కళాశాల విద్యార్థుల నిరసన ప్రదర్శన.
Mamidikuduru: కోనసీమకు రైలు మార్గం నిర్మించాలని విద్యార్థుల నిరసన!
Mamidikuduru: డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు రైలు మార్గం నిర్మించాలని డిమాండ్ చేస్తూ కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో మామిడికుదురులో దీప్తి కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. రైలు మార్గం ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ కోసం అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ శంకుస్థాపన చేసినప్పటికీ, నేటికీ ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోనసీమకు రైల్వే సదుపాయం కల్పిస్తే విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు వివిధ ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు వీలవుతుందని తెలిపారు. తద్వారా విద్య, ఉపాధి అవకాశాలు మరింత సులభతరం అవుతాయన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా కోనసీమ రైల్వే లైన్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
గత రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిన తరహాలోనే కోనసీమ రైల్వే లైన్‌పై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాలకు ఏదో ఒక రూపంలో రైల్వే కనెక్టివిటీ ఉందని, రైల్వే కనెక్టివిటీ లేని జిల్లాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలిచిందని పేర్కొన్నారు. అంబేడ్కర్ వంటి మహోన్నత వ్యక్తి పేరు పెట్టిన ఈ జిల్లాకు వీలైనంత త్వరగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




