Antarvedi: అంతర్వేది సాగరసంగమంలో ఇసుక మేటల్లో చిక్కుకున్న బోటు!
Antarvedi: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సాగరసంగమం వద్ద సముద్రంలో చిక్కుకున్న కాకినాడ సోనా బోటులోని ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించారు.
Antarvedi: అంతర్వేది సాగరసంగమంలో ఇసుక మేటల్లో చిక్కుకున్న బోటు!
Antarvedi: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది సాగరసంగమం సమీపంలో మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది. వేటకు వెళ్లి అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు తిరిగి వస్తున్న కాకినాడకు చెందిన సోనా బోటు ఇసుక మేటలకు తగిలి సముద్రంలో చిక్కుకుంది.
సాగరసంగమానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఏడుగురు మత్స్యకారులతో ఉన్న బోటు చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు మరో బోటు వెళ్లింది. అయితే రక్షణకు వెళ్లిన రెండో బోటుకు కూడా స్వల్పంగా రంధ్రం పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై రెండో బోటును హుటాహుటిన ఒడ్డుకు చేర్చారు.
సమాచారం అందుకున్న కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మెరైన్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. అధికారుల సమన్వయంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
దీంతో మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.సమయస్ఫూర్తితో అధికారులు, పోలీసులు చేపట్టిన సహాయక చర్యలతో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.




