Malikipuram: అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాలి!

Malikipuram: సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాలని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు స్పష్టం చేశారు.

PRABHU, RAZOLE
Published on: 31 Aug 2026 1:24 PM IST
Malikipuram
X

Malikipuram: అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాలి!

Malikipuram: సమాజంలో కుల, మత, సామాజిక అసమానతలు కొనసాగుతున్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని దళిత, బహుజన, రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.

ఆదివారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం లోని ఫూలే– అంబేడ్కర్ సామాజిక భవన్‌లో “రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం– పరిణామాలు–భవిష్యత్ కార్యాచరణ” అంశంపై అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్వేచ్ఛా స్వతంత్ర భావ ప్రకటన వేదిక కన్వీనర్లు జనిపల్లి సత్యానందం, ముత్యాల శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ హేతువాద సంఘం మాజీ అధ్యక్షుడు పెన్మెత్స సుబ్బరాజు మాట్లాడుతూ, దేశంలో కులం, మతం, అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. సామాజిక హోదా, సంపద, రాజ్యాధికారం ఆధిపత్య కులాలకే పరిమితమైందని పేర్కొన్నారు. “రిజర్వేషన్ హఠావో” ఉద్యమం పేరుతో దేశంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

“ప్రతిభ” గురించి మాట్లాడేవారు డొనేషన్ సీట్లు, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ద్వారా ప్రవేశాలు పొందుతున్న వారి గురించి కూడా ప్రశ్నించాలని అన్నారు. రిజర్వేషన్లను తొలగించాలనే ఉద్యమం అగ్రకులాల్లోని పేదలకు కూడా నష్టదాయకమని పేర్కొన్నారు.

మరో ముఖ్య అతిథి, దళిత–బహుజన మహిళా శక్తి జాతీయ అధ్యక్షురాలు కొంకి రాజామణి మాట్లాడుతూ, రిజర్వేషన్లకు ఆర్థిక ప్రాతిపదిక కాకుండా సామాజిక వెనుకబాటుతనమే ప్రాతిపదిక కావాలని అన్నారు.

ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలను వేగంగా ప్రైవేటీకరిస్తున్నారని, ప్రైవేటీకరణ అంటే రిజర్వేషన్ల అవకాశాలను తగ్గించడమేనని వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ల అమలుకు అవకాశాలు పరిమితమవుతున్న నేపథ్యంలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంపై రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని కోరారు.రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సమావేశం తీర్మానించింది.

సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూసి జాన్ మోసే, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ. రవి, కోనసీమ అంబేడ్కర్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మెడబల రాజకుమార్, ప్రముఖ న్యాయవాది బడుగు భాస్కర జోగేష్, విద్యార్థి సంఘం నాయకుడు పోలిశెట్టి గణేష్, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు నల్లి ప్రసాద్, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు గెడ్డం రేచల్ జ్యోతి, చుట్టుగుల్ల నరసింహారావు, పారా సంస్థ డైరెక్టర్ సాకా సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story