Razole: మలికిపురంలో RBI అవగాహన సదస్సు: NBFC రుణాలు, నిబంధనలపై అవగాహన

Razole: మలికిపురంలో ఆర్బీఐ అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో ఎన్‌బీఎఫ్‌సీ ల పనితీరు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, లోన్ యాప్‌ల ప్రమాదాలపై ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 21 Aug 2026 4:26 PM IST
Razole
X

Razole: మలికిపురంలో RBI అవగాహన సదస్సు: NBFC రుణాలు, నిబంధనలపై అవగాహన

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లోని మలికిపురంలో RBI ప్రతినిధులు పర్యటించారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై ఎనుముల వెంకటపతిరాజా ఫిర్యాదు మేరకు మలికిపురంలోని ఏఎఫ్డీటీ విద్యాసంస్థల మీటింగ్ హాల్‌లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా RBI అధికారులు LDO రవీంద్ర, ఉదయ్ తేజ్, ఆదిత్య, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కేశవ్ వర్మలు NBFCలు (Non- Banking Financial Companies) ఎలా పనిచేస్తాయి, రుణాలపై వడ్డీ విధానం, రుణాల రికవరీ తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. రుణాలు తీసుకునే సమయంలో సంస్థల నిబంధనలు, వడ్డీ రేట్లు, చెల్లింపు విధానాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.

సదస్సుకు మరో విశిష్ట అతిథిగా హాజరైన రాజోలు సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ, మైక్రోఫైనాన్స్ సంస్థలు పనిచేసే విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఏ బ్యాంకులో రుణం తీసుకున్నా ఆ బ్యాంకు విధించే నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రుణం తీసుకోవాలని హితవు పలికారు. ఆన్‌లైన్, మొబైల్ యాప్‌ల ద్వారా అందించే అనుమానాస్పద రుణాలను నమ్మవద్దని హెచ్చరించారు.

టెలిగ్రామ్ తదితర యాప్‌ల ద్వారా జరిగే అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ అనే విధానం చట్టంలో లేదని, ఎవరైనా ఫోన్ చేసి ఈ పేరుతో బెదిరించినా, నగదు డిమాండ్ చేసినా భయపడకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సీఐ సురేష్ బాబు కోరారు. ప్రజలు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండి, మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story