Razole: రాజోలు ఎస్సీ బాలుర హాస్టల్ నిర్మాణంలో నిర్లక్ష్యం
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఎస్సీ బాలుర వసతి గృహం నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంపై దళిత చైతన్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది.
Razole: రాజోలు ఎస్సీ బాలుర హాస్టల్ నిర్మాణంలో నిర్లక్ష్యం
రాజోలు: డాక్టర్. బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు లో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కొత్తగా నిర్మిస్తామని చెప్పి పాత భవనాన్ని కూల్చివేసి, ఏడాది గడిచినా నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత చైతన్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం రాజోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, తహసీల్దార్ కార్యాలయ ఇన్చార్జికి, ఎంపీడీవో కె. వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వేదిక నాయకులు మాట్లాడుతూ, గత ఏడాది జూలైలో బాలుర వసతి గృహాన్ని కూల్చివేసినప్పటి నుంచి ఇప్పటివరకు కొత్త భవనం నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే కూల్చివేసిన భవనం నుంచి వచ్చిన నిర్మాణ సామగ్రి ఏమైందనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీడీవోను కోరారు. జూలై 10లోపు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే నియోజకవర్గంలోని దళిత సంఘాలన్నింటిని కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, డీహెచ్‌పీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, జిల్లా అధ్యక్షులు లిఖితపూడి బుజ్జి, ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, మండల అధ్యక్షులు మందపాటి మధు, తోటే ప్రతాప్, డొల్లా జాన్ మార్టిన్, నీతిపూడి సత్యనారాయణ, గెడ్డం చిన్న, గోగి మోహన్, పొన్నమాటి భాస్కర్, మెడబల శ్యాంశేఖర్, బత్తుల సరస్వతీరావు, కారుపల్లి గోపాలన్, డాక్టర్ బాబు, బి. రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




