Razole: రాజోలులో ఆర్టీఈ విద్యార్థులపై వివక్ష?.. విచారణకు డిమాండ్!

Razole: రాజోలులో విద్యా హక్కు చట్టం (RTE) కింద చేరిన పేద విద్యార్థుల పట్ల ప్రైవేట్ పాఠశాలలు వివక్ష చూపుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

PRABHU, RAZOLE
Published on: 25 Jun 2026 4:51 PM IST
Razole
X

Razole: రాజోలులో ఆర్టీఈ విద్యార్థులపై వివక్ష?.. విచారణకు డిమాండ్!

రాజోలు: విద్య అనేది హక్కు... దానం కాదు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన *విద్యా హక్కు చట్టం-2009 (RTE Act)*లోని సెక్షన్ 12(1)(C) ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించాలి. అయితే అదే చట్టం కింద చదువుతున్న విద్యార్థులు వివక్షను ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి.

రాజోలు నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో RTE కోటా విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సౌకర్యాలు, పాఠశాల కార్యక్రమాల్లో భాగస్వామ్యం విషయంలో వ్యత్యాసం చూపుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒకే తరగతి గదిలో చదువుతున్న పిల్లలను "ఫ్రీ సీటు విద్యార్థులు"గా గుర్తించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RTE చట్టం ఉద్దేశం పేద పిల్లలను విద్యా ప్రవాహంలోకి తీసుకురావడం. కానీ వారిని ప్రత్యేకంగా చూపించి మానసికంగా వెనక్కి నెట్టడం కాదు. విద్యార్థుల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని చట్టం చెబుతుంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఇదిలా ఉంటే, ప్రభుత్వం అమలు చేస్తున్న "తల్లికి వందనం" వంటి పథకాల ప్రయోజనాలు కూడా RTE విద్యార్థుల కుటుంబాలకు అందడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పటికీ, ఇతర విద్యార్థులకు లభించే ప్రోత్సాహకాలు తమ పిల్లలకు ఎందుకు వర్తించకూడదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ ఆరోపణలను పాఠశాలల యాజమాన్యాలు ఖండిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, సంబంధిత మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, RTE విద్యార్థులపై ఉద్దేశపూర్వక వివక్ష చూపడం లేదని చెబుతున్నాయి.

ఒకవైపు తల్లిదండ్రుల ఆవేదన, మరోవైపు పాఠశాలల వివరణల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే వాస్తవ పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. పేద పిల్లలకు సీటు ఇవ్వడం మాత్రమే కాదు... సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించడమే RTE చట్టం అసలు స్ఫూర్తి. ఆ స్ఫూర్తి దెబ్బతింటే విద్యా హక్కు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story