Razole: రాజోలులో ఘనంగా ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ
Razole: రాజోలులో తెలగ-కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ. హాజరైన జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు, ప్రముఖులు.
Razole: రాజోలులో ఘనంగా ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ
రాజోలు: కాపు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమ సూర్యుడు, రాజీపడని పోరాట యోధుడు, మాజీ మంత్రి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను రాజోలు తాలూకా తెలగ-కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజోలు మండలం శివకోటి కాపు కళ్యాణ మండపంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, అభిమానులు ఏకవేదికపై చేరి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం తన జీవితాన్ని కాపు సామాజిక వర్గ హక్కులు, ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం అంకితం చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. పదవులు, ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పోరాడిన అరుదైన నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
కాపు ఉద్యమానికి ఆయన అందించిన నాయకత్వం, సామాజిక న్యాయం కోసం సాగించిన ఉద్యమాలు, సమాజంపై చూపిన అంకితభావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని వక్తలు అభిప్రాయపడ్డారు. ముద్రగడ పద్మనాభం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినవారమవుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తాలూకా తెలగ - కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు కొమ్ముల మధుమూర్తి,గౌరవ అధ్యక్షులు సోమిశెట్టి ఆంజనేయులు మరియు కుంపట్ల చిన్నారి, మంగెన నరసింహారావు, అడబాల సత్యనారాయణ, సూదా బాబ్జి, మంగెన రాధాకృష్ణ, సూరిశెట్టి బాబీ, కటకంశెట్టి ఆదిత్య, వీరా మల్లిబాబు, సూరిశెట్టి శ్రీనివాస్, కంకిపాటి నరసింహారావు, బోనం సాయి, మంగెన భూదేవి, ముపర్తి నాని, మంగెన సింహాద్రి, పప్పుల రమేష్, తొరం భాస్కరరావు, చిక్కం సత్యప్రసాద్, జక్కంపూడి వాసు, కొమ్ముల రాము, కొమ్ముల కొండలరావు, పోతు కాశి తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కాపు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ముద్రగడ పద్మనాభం సేవలను స్మరించుకున్నారు.




