Razole: రాత్రి వేళల్లోనూ వైద్యం అందాలి.. రాజోలు ఎమ్మెల్యే ఆదేశం
Razole: రాజోలు నియోజకవర్గంలోని లక్కవరం, మోరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (PHC) సందర్శించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.
Razole: రాత్రి వేళల్లోనూ వైద్యం అందాలి.. రాజోలు ఎమ్మెల్యే ఆదేశం
రాజోలు: డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లోని లక్కవరం, మోరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీ) రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సందర్శించి వైద్య సేవల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు.
ఆసుపత్రుల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాత్రి వేళల్లో కూడా వైద్య సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండి అత్యవసర రోగులకు సత్వర వైద్యం అందించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా నాణ్యమైన సేవలు అందించాలని, రోజువారీ ఓపీ (అవుట్ పేషంట్) సంఖ్య పెరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
నియోజకవర్గంలో క్యాన్సర్ నిర్ధారణ కోసం ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి అర్హుడికి ఏబీహెచ్ఏ (ABHA) కార్డు అందేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధుల సమీకరణకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




