Razole: రాజోలు ఎస్సీ హాస్టల్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

Razole: రాజోలు ఎస్సీ బాలుర హాస్టల్ భవన నిర్మాణ పనుల జాప్యంపై దళిత సంఘాల నిరసన. హాజరైన మాజీ ఎంపీ హర్షకుమార్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ.

PRABHU, RAZOLE
Published on: 29 July 2026 2:53 PM IST
Razole
X

Razole: రాజోలు ఎస్సీ హాస్టల్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

రాజోలు: డాక్టర్ .బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లోని ఎస్సీ వెల్ఫేర్ బాలుర హాస్టల్ నూతన భవన నిర్మాణ పనులను ప్రభుత్వం, సంబంధిత అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణమే ప్రారంభించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అవసరమైన వసతుల కల్పనలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని వారు స్పష్టం చేశారు.

ఎస్సీ బాలుర హాస్టల్ పాత భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఏడాది కాలం గడిచినా పనులు ప్రారంభం కాకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం విద్యార్థులు తాత్కాలిక భవనంలో ఉండాల్సి రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది వారి విద్యాభ్యాసం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్య పరిష్కారం కోసం దళిత సంఘాలు పలుమార్లు జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులకు వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఎస్సీ సంఘాల ప్రతినిధులు మంగళవారం రాజోలు ఎంఆర్వో కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హాస్టల్ నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసి పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి హాస్టల్ నిర్మాణంపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, లేకపోతే విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాల్సి వస్తుందని మాజీ ఎంపీ హర్షకుమార్ హెచ్చరించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story