Rampachodavaram: పోలీసుల దాడి.. 10 కిలోల గంజాయి స్వాధీనం, నలుగురిపై కేసు!
Rampachodavaram: రంపచోడవరంలో 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. బైక్, 3 సెల్‌ఫోన్లు జప్తు చేసి తెలంగాణతో సహా నలుగురిపై కేసు నమోదు.
Rampachodavaram: పోలీసుల దాడి.. 10 కిలోల గంజాయి స్వాధీనం, నలుగురిపై కేసు!
Rampachodavaram: పోలవరం జిల్లారంపచోడవరం గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చేపట్టిన తనిఖీల్లో 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక మోటార్‌సైకిల్, మూడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లను కూడా పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ఈ నెల 27న పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రంపచోడవరం ఎస్‌డీపీఓ అష్రఫ్ అలీ ఆధ్వర్యంలో రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగించారు.
రంపచోడవరం సీఐ టి.జి.ఎన్. ప్రసాద్, ఎస్‌ఐ పి. రమేష్‌తో పాటు పోలీసు సిబ్బంది గంజాయి రవాణాకు పాల్పడుతున్న వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంపచోడవరం శివారులోని గంజాయి బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని గుర్తించి తనిఖీలు నిర్వహించగా వారి వద్ద 10 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని, రవాణాకు ఉపయోగించినట్లు భావిస్తున్న మోటార్‌సైకిల్‌తో పాటు మూడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో రంపచోడవరం మండలం ఐ.పోలవరం గ్రామానికి చెందిన పోసి బాబు అలియాస్ పోసి కుమారుడు 22 ఏళ్ల సాలాది వెంకట దుర్గ ప్రసాద్, తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ సైనత్‌పురం ప్రాంతానికి చెందిన చంద్రరావు కుమారుడు 30 ఏళ్ల కామేపల్లి నరేష్, రంపచోడవరం గ్రామానికి చెందిన ఎర్రపుదొర కుమారుడు 25 ఏళ్ల కలుము హరినాథ్, రంపచోడవరం మండలం చిన్నగొట్టాలరేవుకు చెందిన దివంగత వెంకటేష్ కుమారుడు 18 ఏళ్ల కరచి నాగేంద్రలను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో కొందరు గంజాయి తరలింపు, విక్రయాలకు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.
ఎక్కడికి తరలించేందుకు ప్రయత్నించారు, ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలోని సమాచారాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, గంజాయి సరఫరా, రవాణా వ్యవస్థపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు సూచించారు.




