Rajahmundry: కార్మిక భవన్ అభివృద్ధికి రూ.60 లక్షలు మంజూరు - ఎమ్మెల్యే వాసు
Rajahmundry: రాజమండ్రి క్వారీ సెంటర్‌లో కార్మిక భవన్ అభివృద్ధికి రూ.60 లక్షలు మంజూరు. ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు కార్మికుల కృతజ్ఞతలు.
Rajahmundry: కార్మిక భవన్ అభివృద్ధికి రూ.60 లక్షలు మంజూరు - ఎమ్మెల్యే వాసు
రాజమండ్రి: కార్మికుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్మికుల సౌకర్యార్థం క్వారీ సెంటర్‌లోని కార్మిక భవన్ అభివృద్ధికి రూ.60 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు కార్మిక సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ సీనియర్ కార్మిక నాయకులు వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు తదితరుల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం, టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటాయన్నారు.
క్వారీ సెంటర్‌లో నిర్మించనున్న శ్రామిక భవనానికి నిధులు మంజూరు చేయడంలో సహకరించిన ఎంపీ పురందేశ్వరికి కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భవనానికి సంబంధించి మిగిలిన పనులను కూడా పూర్తి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు.
కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు త్వరలో కార్మిక సంఘాల ప్రతినిధులు, లేబర్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యలను సమగ్రంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన పేపర్ మిల్లు ఎన్నికల్లో టీడీపీ అనుబంధ కార్మిక సంఘమైన టీఎన్‌టీయూసీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడం కార్మికుల్లో టీడీపీకి ఉన్న మద్దతుకు నిదర్శనమని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్మికుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.




