Rajahmundry: పుష్కరాల నాటికి మరో 22 పార్కుల అభివృద్ధి ఎమ్మెల్యే!

Rajahmundry: రాజమండ్రిలో పుష్కరాల నాటికి మరో 22 పార్కులను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 3 Sept 2026 12:41 PM IST
Rajahmundry
X

Rajahmundry: పుష్కరాల నాటికి మరో 22 పార్కుల అభివృద్ధి ఎమ్మెల్యే!

Rajahmundry: రానున్న పుష్కరాల నాటికి నగరంలో మరో 22 పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్థానిక 13వ డివిజన్‌లోని వెలుగు పార్కును రూ.9 లక్షలతో ఆధునీకరించే పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 13వ డివిజన్ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉందని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతూనే ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్‌లో ఇప్పటికే సుమారు రూ.60 లక్షల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు.

వెలుగు పార్కు అభివృద్ధిలో భాగంగా వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలు, పిల్లల ఆట స్థలం, నేమ్ బోర్డులు, పెయింటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పనులు పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి ఈ పార్కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఇప్పటికే నగరంలో 25 పార్కులను అభివృద్ధి చేశామని, పుష్కరాల నాటికి మరో 22 పార్కులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అభివృద్ధి అంటే కేవలం ప్రధాన రహదారులు, డివైడర్లు నిర్మించడం మాత్రమే కాదన్నారు.

గత పాలకులు ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా పలుచోట్ల డివైడర్లు ఏర్పాటు చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి వాటికి తగ్గట్టు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రధాన రహదారులతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న ఇంటర్నల్ రోడ్లు, పార్కులు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లి బుజ్జి, కప్పల వెలుగు కుమారి, నగరబోయిన రామకృష్ణ, బొర్రా చిన్ని, వై దేవి వరప్రసాద్, మండా నారాయణ, చెల్లుబోయిన మూర్తి, వీర్రాజు, శెట్టి అప్పారావు, పొలవరపు సోమరాజు, రాము, తూటా రాజేష్, తోట సుబ్రహ్మణ్యం తదితరులతో పాటు స్థానిక మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story