Rajahmundry: పేపర్ మిల్లు కాలుష్యంపై జేసీ మేఘా స్వరూప్ సమీక్ష
Rajahmundry: రాజమండ్రిలో పేపర్ మిల్లు కాలుష్యం, పన్ను బకాయిలపై జేసీ మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా సమీక్ష. నోటీసులు జారీ చేసిన ఏపీపీసీబీ అధికారులు.
Rajahmundry: పేపర్ మిల్లు కాలుష్యంపై జేసీ మేఘా స్వరూప్ సమీక్ష
రాజమండ్రి: పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు, వాయు కాలుష్యం, భారీ వాహనాల రాకపోకల కారణంగా ఏర్పడుతున్న ధూళి కాలుష్యం తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా , పొల్యూషన్ కంట్రోల్ అధికారులతో కలిసి గురువారం సమీక్ష నిర్వహించారు.
నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్‌లో పేపర్ మిల్లు యాజమాన్యం, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) అధికారులతో సమావేశం జరిగింది.
ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ETP) ఇన్‌లెట్, అవుట్‌లెట్‌ల నుంచి ఏపీపీసీబీ అధికారులు నెలవారీగా నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొన్ని నమూనాల్లో నిర్దేశిత పరిమితులకు మించి కాలుష్య స్థాయిలు నమోదైనట్లు అధికారులు జాయింట్ కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి జూన్ 4, 2026న నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు.
అలాగే 2023 జనవరి 31 నుంచి 2026 మే 14 వరకు సేకరించిన 40 నమూనాల్లో 9 నమూనాల్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) నిర్దేశిత పరిమితులను మించినట్లు గుర్తించినట్లు తెలిపారు. దీనిపై మే 28, 2026న షోకాజ్ నోటీసు, జూన్ 18, 2026న మరో నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 2024 ఆగస్టు 8న నిర్వహించిన స్టాక్ పర్యవేక్షణలో PM/H₂S పరిమితులు మించినట్లు గుర్తించగా, దీనిపై అదే నెల 20న షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
శుద్ధి చేసిన వ్యర్థ జలాలను నేరుగా సముద్రంలోకి విడుదల చేసేందుకు ప్రత్యేక డ్రెయిన్‌ను అన్వేషించాలని 2017లోనే పరిశ్రమకు స్పష్టంగా సూచించినట్లు ఏపీపీసీబీ అధికారులు తెలిపారు.
ఆ సూచనలను అమలు చేయని నేపథ్యంలో 2017 జనవరి 30 నుంచి 2026 సెప్టెంబర్ 3 వరకు పర్యావరణ నష్టపరిహారం విధించేందుకు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. పర్యావరణ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ కాలుష్య నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
మల్లయ్యపేట–కాతేరు రహదారిపై ధూళి కాలుష్యానికి అడ్డుకట్ట భారీ వాహనాల రాకపోకలతో రహదారి దెబ్బతినడంపై చర్యలు.. పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు.
ఇసుక, ఇతర ముడి పదార్థాలను రవాణా చేసే భారీ వాహనాల రాకపోకల కారణంగా మల్లయ్యపేట –కాతేరు రహదారిపై తీవ్ర ధూళి కాలుష్యం ఏర్పడటంతో పాటు రహదారి కలుషితం కావడం, దెబ్బతినడం వంటి సమస్యలను అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు, వాహన దారులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన కాలుష్య నియంత్రణ, రహదారి పరిరక్షణ చర్యలు చేపట్టాలని సమీక్షలో చర్చించారు.
అనంతరం నగరపాలక సంస్థ, కాతేరు పంచాయతీ పరిధిలో పేపర్ మిల్లుకు సంబంధించిన పన్ను బకాయిల అంశంపై కూడా సుదీర్ఘంగా సమీక్షించారు. పన్ను బకాయిలు పెండింగ్‌లో లేకుండా నిబంధనల ప్రకారం చెల్లింపులు చేపట్టాలని అధికారులు మిల్లు యాజమాన్యానికి సూచించారు. స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్నులు, ఇతర బకాయిలను సకాలంలో చెల్లించడం ద్వారా పరిపాలనా వ్యవస్థకు సహకరించాలని స్పష్టం చేశారు.
సమీక్షలో ఏపీపీసీబీ ఈఈ ఐ సూర్య కళ, రెవెన్యూ అధికారి (ఆర్ఎంసీ) సీహెచ్. శ్రీనివాసరావు, ఏపీపీసీబీ అధికారులు, పేపర్ మిల్లు యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.




