Rajahmundry: ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

Rajahmundry: రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 12 Sept 2026 5:42 PM IST
Rajahmundry
X

Rajahmundry: ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

రాజమండ్రి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు వ్యవస్థల్లో సంస్కరణలకు శ్రీకారం చుడుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇందులో భాగంగానే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ (CCB)ను శనివారం ఆయన ప్రారంభించారు.

కేంద్ర మంత్రి జె.పి. నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా ప్రారంభించగా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే వాసు ఇక్కడి బ్లాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 650 పడకలు ఉండగా, కొత్తగా అందుబాటులోకి వచ్చిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌తో వైద్య సేవల సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు.

అవసరాన్ని బట్టి మరో 25 నుంచి 30 పడకలు పెంచుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. మీడియా ద్వారా ఆసుపత్రిలో బెడ్ల కొరత, ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులు చికిత్స పొందుతున్న పరిస్థితులు తమ దృష్టికి వచ్చాయని, ప్రజలు చెబుతున్న ప్రతి సమస్యను ప్రభుత్వం వింటుందని, విని వదిలేయకుండా పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతోందనడానికి క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుకు రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు రావడం గర్వకారణమన్నారు. ఈ ఘనత వైద్యులు, సూపరింటెండెంట్, సిబ్బంది, అధికారులు చేస్తున్న సమష్టి కృషికి దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు ఎక్స్‌రే తదితర సేవల్లో ఉన్న ఇబ్బందులను కూడా పరిష్కరించామని తెలిపారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని, పుష్కరాలకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కొత్త క్రిటికల్ కేర్ బ్లాక్ పుష్కరాల సమయంలో కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ బాగున్నాయని చెప్పి వెళ్లే వ్యక్తిని తాను కాదని, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఇది పెద్ద వ్యవస్థ కావడంతో రాత్రికి రాత్రే మార్పులు తీసుకురాలేమన్నారు. అయితే లోపాలను గుర్తించి వాటిని సరిచేసేందుకు నిరంతరం ప్రయత్నించడమే నాయకుడి చిత్తశుద్ధని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతోందనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన కేంద్ర మంత్రి జె.పి. నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు రాజమహేంద్రవరం నగర ప్రజల తరపున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY