Rajahmundry: సెప్టెంబర్ 9 రాజకీయ కక్ష సాధింపునకు నిదర్శనం - ఎమ్మెల్యే వాసు
Rajahmundry: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజమండ్రిలో 'నిజం గెలిచింది' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
Rajahmundry: సెప్టెంబర్ 9 రాజకీయ కక్ష సాధింపునకు నిదర్శనం - ఎమ్మెల్యే వాసు
రాజమండ్రి: దేశ రాజకీయ చరిత్రలో సెప్టెంబర్ 9 ఒక చీకటి రోజని, తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మర్చిపోలేని రోజని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచిందని ఆయన మండిపడ్డారు.
తిలక్ రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని ఎదుర్కొనే రాజకీయ శక్తి లేకనే గత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసును తెరపైకి తెచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు.
తొలుత రూ.3 వేల కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసి, ఆ తర్వాత రూ.300 కోట్లు, రూ.30 కోట్లుగా మాట మార్చారని విమర్శించారు. చివరకు అవినీతి జరగలేదని న్యాయస్థానాలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ఒక విజనరీ నాయకుడిని ప్రిజనరీ నాయకుడు అన్యాయంగా అరెస్టు చేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో 2024 ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పారని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తీసుకొచ్చిన సమయంలో ఆయనకు సంబంధించిన ఫొటో బయటకు ఎలా వచ్చిందో నాటి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన ప్రివిలేజెస్‌ను కూడా పట్టించుకోకుండా జైలులో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండే నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రజల్లోకి వచ్చారని, ‘నిజం గెలవాలి’ అనే నినాదంతో పోరాటం చేశారని గుర్తుచేశారు.
నారా లోకేష్ ఒకవైపు తండ్రి అరెస్టుపై ఆవేదనను భరిస్తూనే మరోవైపు పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ న్యాయపోరాటం కొనసాగించారని గుర్తు చేశారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన రోజు జైలు నుంచి లాలాచెరువు వరకు ఆరు నిమిషాల్లో వెళ్లే దూరానికి ఆరు గంటలు పట్టిందని, ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలివచ్చారని, అదే చంద్రబాబు పట్ల ప్రజల అభిమానానికి నిదర్శనమన్నారు.
చంద్రబాబు అరెస్టు జరిగిన సెప్టెంబర్ 9 తో పాటు అక్టోబర్ 31న జరిగిన పరిణామాలను కూడా టీడీపీ ప్రతి ఏడాది గుర్తు చేసుకుంటుందని చెప్పారు. 53 రోజుల పాటు తమ నాయకుడి కుటుంబం పడిన బాధను, కార్యకర్తలు చేసిన పోరాటాన్ని ఎప్పటికీ మర్చిపోమన్నారు. సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు కుటుంబానికి ఆ సమయంలో అండగా నిలిచారని, వారిని కార్యకర్తలుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని నారా లోకేష్ కూడా చెప్పారని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాల రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్‌కుమార్, గౌతమీ జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, తుల్లి పద్మ, అనంత్, 42 డివిజన్లకు చెందిన కమిటీ సభ్యులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




