Rajahmundry: మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతులు!

Rajahmundry: మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని సూచనలు చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 4 Sept 2026 1:40 PM IST
Rajahmundry
X

Rajahmundry: మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతులు!

Rajahmundry: విద్యార్థులు చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మంచి ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు.

నగరంలోని సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండ్ మోటివేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలో నేర్చుకున్న మంచి విషయాలను జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే వాటికి నిజమైన విలువ ఉంటుందన్నారు.

తాము చదువుకున్న పాఠశాల, ఊరు, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. చెడు స్నేహాలకు, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను అవసరమైన మేరకే వినియోగించాలని విద్యార్థులకు సూచించారు.

తల్లికి చెప్పుకోలేని పని ఏదీ చేయకూడదు అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మార్గదర్శక సూత్రంగా తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుంగిపోకుండా వాటిని ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా మున్సిపల్ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. తన రెండేళ్ల పదవీకాలంలో మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.2 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు సమీకరించినట్లు చెప్పారు.

పాఠశాలల్లో అవసరమైన తరగతి గదులు, స్లాబ్ రిపేర్లు, పెయింటింగ్, కంప్యూటర్లు, ప్రింటర్లు, సీసీ కెమెరాలు తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాగే 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల్లో తక్కువ ఫీజులతో ఇంటర్మీడియట్ విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

2025–26 విద్యా సంవత్సరంలో 500కు పైగా మార్కులు సాధించిన వారిలో సుమారు 240 మంది విద్యార్థులకు నగరంలోని ప్రముఖ ప్రైవేట్ కళాశాలల్లో తక్కువ ఫీజులతో చదివే అవకాశం కల్పించినట్లు చెప్పారు. పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు, దాతలు, స్థానిక నాయకులు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.

సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో షెడ్లు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు తదితర సౌకర్యాలు కల్పించడం ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మోటివేటర్ లయన్ డాక్టర్ కేడీజే బాబు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, జీవితంలో లక్ష్యసాధన తదితర అంశాలపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు.

కార్యక్రమ నిర్వాహకురాలు విజయలక్ష్మి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి నాణ్యతను పరిశీలించారు.

మధ్యాహ్న భోజన పథకానికి మహనీయుల పేర్లు పెట్టడం సముచితమని, పాఠశాలలు, దేవాలయాల్లో రాజకీయాలకు తావు లేకుండా విద్యార్థుల భవిష్యత్తుపైనే దృష్టి పెట్టాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, ఉప్పులూరి జానకిరామయ్య, మాటూరి సిద్ధు, ఎం.ఎన్. రావు, బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, దాతలు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story