Rajahmundry: రాజమండ్రిలో భారతీయ విద్యాభవన్ పేరెంట్స్-టీచర్స్ మీట్
Rajahmundry: రాజమండ్రి నామవరం భారతీయ విద్యాభవన్‌లో పేరెంట్స్-టీచర్స్ మీట్. విద్యతో పాటు నైతిక విలువలు ముఖ్యం ಎಂದ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
Rajahmundry: రాజమండ్రిలో భారతీయ విద్యాభవన్ పేరెంట్స్-టీచర్స్ మీట్
రాజమండ్రి: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, మంచి సంస్కారం ఎంతో కీలకమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం నామవరంలోని భారతీయ విద్యాభవన్లో నిర్వహించిన పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
భారతీయ విద్యాభవన్ తనకు కేవలం ఒక విద్యాసంస్థ కాదని, తనను తీర్చిదిద్దిన సొంత ఇల్లు, కుటుంబం వంటిదన్నారు. తాను 8, 9, 10వ తరగతులను భీమవరం భారతీయ విద్యాభవన్ క్యాంపస్‌లో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, నైతిక విలువలే తన వ్యక్తిత్వ వికాసానికి, ప్రజాసేవలో ముందుకు సాగేందుకు ఎంతో దోహదపడ్డాయని తెలిపారు.
భారతీయ విద్యాభవన్ పూర్వ విద్యార్థిగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం తనకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. “భారతీయ విద్యాభవన్ ఒక సంస్థ మాత్రమే కాదు.. విలువలు, విశ్వాసంతో కూడిన ఒక బ్రాండ్” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భీమవరం కేంద్ర మేనేజ్‌మెంట్ సభ్యులు, గౌరవనీయులు యు.కె. విశ్వనాథ రాజు, అకాడమిక్స్ డైరెక్టర్ డాక్టర్ రఘుపతి రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి. ఉమేష్ రెడ్డితో పాటు ఉపాధ్యాయ బృందానికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నేటి ఆధునిక కాలంలో పిల్లలకు కేవలం పుస్తకాల విద్య, మంచి మార్కులు మాత్రమే సరిపోవన్నారు. మార్కులతో పాటు మంచి సంస్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన, నైతిక విలువలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు క్రమశిక్షణ, విద్యా విలువలు నేర్పడంతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఎంతో అవసరమని అన్నారు.
పిల్లల ప్రతిభను గుర్తించి, వారికి సరైన దిశానిర్దేశం చేస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. భారతీయ విద్యాభవన్‌లో చదువుతున్న విద్యార్థులు తమకు అందుతున్న విద్య, విలువలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలను శ్రద్ధగా పాటిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని చెప్పారు. తాము ఏ రంగాన్ని ఎంచుకున్నా దేశానికి, రాజమహేంద్రవరం నగరానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా నగరంలోని విద్యాసంస్థల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. తనను ముఖ్య అతిథిగా కాకుండా భారతీయ విద్యాభవన్ పూర్వ విద్యార్థిగా, తమ కుటుంబంలో ఒకరిగా భావించి ఆహ్వానించిన యాజమాన్యానికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




