Razole: ‘QVSE’ యాప్‌తో జాగ్రత్త రాజోలు సీఐ సురేష్‌బాబు హెచ్చరిక!

Razole: రాజోలులో 'QVSE' ఇన్వెస్ట్‌మెంట్ యాప్ పట్ల పోలీసుల హెచ్చరిక. అధిక లాభాల పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఐ సురేష్‌బాబు సూచించారు.

PRABHU, RAZOLE
Published on: 11 Sept 2026 9:26 AM IST
Razole
X

Razole: ‘QVSE’ యాప్‌తో జాగ్రత్త రాజోలు సీఐ సురేష్‌బాబు హెచ్చరిక!

Razole: అధిక లాభాలు, రోజువారీ వడ్డీ అంటూ ప్రజలను ఆకర్షిస్తున్న ‘QVSE’ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజోలు సీఐ సురేష్‌బాబు హెచ్చరించారు. డాలర్లలో పెట్టుబడులు పెడితే అధిక రాబడులు వస్తాయని, నెలకు రూ.600 వరకు వడ్డీ చెల్లిస్తామని నమ్మిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఆన్‌లైన్ పెట్టుబడి యాప్‌ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

ఇలాంటి మోసాల్లో మొదట చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించుకుని, వాటికి లాభాలు వచ్చినట్లు చూపిస్తూ బాధితుల్లో నమ్మకాన్ని పెంచుతారని సీఐ తెలిపారు. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి చేసి, నగదు బదిలీ చేయించుకున్న అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అధిక లాభాలు, తక్కువ సమయంలో భారీ రాబడులు వస్తాయనే హామీలను నమ్మి ప్రజలు తమ కష్టార్జిత సొమ్మును ప్రమాదంలోకి నెట్టుకోవద్దని సూచించారు.

పోలీసుల సూచనలు

గుర్తుతెలియని ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, వెబ్‌సైట్లు లేదా వ్యక్తులు సూచించే పథకాల్లో వెంటనే పెట్టుబడులు పెట్టవద్దు.

అసాధారణంగా అధిక రాబడి, రోజువారీ వడ్డీ, తక్కువ సమయంలో రెట్టింపు లాభాలు వంటి హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు దాని విశ్వసనీయత, సంస్థ వివరాలు, రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించాలి.

తెలియని వ్యక్తులు పంపే లింకులపై క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం చేయవద్దు.

OTP, ATM/డెబిట్ కార్డు వివరాలు, UPI PIN, పాస్‌వర్డ్‌లు వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు వెల్లడించవద్దు.

పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థకు చట్టబద్ధమైన అనుమతులు, నియంత్రణ సంస్థల రిజిస్ట్రేషన్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి.

ఇప్పటికే ఇలాంటి యాప్‌లో డబ్బులు పెట్టి అనుమానం కలిగితే మరిన్ని నగదు బదిలీలు చేయకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలి.

ప్రజలు అత్యాశకు గురికాకుండా, పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సీఐ సురేష్‌బాబు సూచించారు. ఆన్‌లైన్‌లో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, అధిక లాభాల హామీలను గుడ్డిగా నమ్మవద్దని, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల అప్రమత్తతే సైబర్, ఆర్థిక మోసాలను అరికట్టడంలో కీలకమని ఆయన పేర్కొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story