P.Gannavaram: పి.గన్నవరంలో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం ప్రారంభం
P.Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. డాక్టర్‌కు ప్రశంసా పత్రం.
P.Gannavaram: పి.గన్నవరంలో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం ప్రారంభం
పి.గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం, పి.గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లులు, నవజాత శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఈ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.
తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా తల్లులు, బిడ్డలకు సురక్షితమైన, సమయానుకూలమైన రవాణా సదుపాయం కల్పించడంతో పాటు వారి ప్రయాణ ఖర్చులను తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యమని ఎమ్మెల్యే తెలిపారు. వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగులు, కాల్ సెంటర్‌కు అనుసంధానమైన ఎమర్జెన్సీ అలర్ట్ బటన్ వంటి భద్రతా సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమం అనంతరం పి.గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ యు. రాఘవేంద్ర మూడు నెలల వ్యవధిలో 378 ఆపరేషన్లు నిర్వహించినందుకు ప్రభుత్వం అందించిన ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తన చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ యు. రాఘవేంద్ర సేవలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరచడంలో, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో డాక్టర్ రాఘవేంద్ర గారు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తల్లి, బిడ్డల ఆరోగ్య భద్రతతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే అభినందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




