Rajamahendravaram: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పవన్ కళ్యాణ్ ఆరా!

Rajamahendravaram: రాజమండ్రి వద్ద ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం. ముమ్మరంగా గాలింపు చర్యలకు ఆదేశం.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 17 Aug 2026 12:43 PM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పవన్ కళ్యాణ్ ఆరా!

Rajamahendravaram: రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా ఆరా తీసిన ఆయన.. గల్లంతైన కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి.. గల్లంతైన వారి కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చేపట్టాలని సూచించారు. అవసరమైతే ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించాలని ఆదేశించారు. ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని స్పష్టం చేశారు.

ఏఈ నూకరాజు కుటుంబం ఈ పరిస్థితికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వారిపై ఏమైనా ఒత్తిళ్లు, బెదిరింపులు లేదా వేధింపులు ఉన్నాయా? అనే కోణాల్లోనూ విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఘటన నుంచి బయటపడిన నూకరాజు మనుమడి పరిస్థితిని కూడా ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించి పూర్తిగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఘటన నేపథ్యంలో ప్రజలకు పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా దానికి పరిష్కార మార్గం ఉంటుందని, క్షణికావేశం లేదా మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. బెదిరింపులు, వేధింపులు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైతే మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.

ప్రాణం అమూల్యమైనదని.. సమస్యల నుంచి పారిపోవడం కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే మార్గమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story