Malikipuram: మలికిపురం ఓఎన్‌జీసీ బాధితుల ఆందోళన - రాస్తారోకో
Malikipuram: ఇరుసుమండలో ఓఎన్‌జీసీ బ్లో అవుట్ బాధితుల రాస్తారోకో. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం, ఓఎన్‌జీసీ విఫలం. నష్టపరిహారం కోసం గ్రామస్తుల ఆందోళన.
Malikipuram: మలికిపురం ఓఎన్‌జీసీ బాధితుల ఆందోళన - రాస్తారోకో
మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఈ ఏడాది జనవరి 5న జరిగిన ఓఎన్‌జీసీ బ్లో అవుట్ ఘటన బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. తమకు ప్రకటించిన హామీలను ప్రభుత్వం, ఓఎన్‌జీసీ అధికారులు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ గ్రామస్తులు రోడ్డుపై టెంట్ వేసి బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
బ్లో అవుట్ అనంతరం ఓఎన్‌జీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు బాధితులకు పలు హామీలు ఇచ్చారని, అయితే రూ.10 వేల నగదు పరిహారం మినహా మిగిలిన హామీలేవీ అమలు కాలేదని గ్రామస్తులు తెలిపారు. ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, ఆరోగ్య బీమా, లక్కవరంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు వంటి హామీలు ఇప్పటికీ నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే బ్లో అవుట్ కారణంగా నష్టపోయిన కొబ్బరి రైతులకు నష్టపరిహారం అందించకుండా, నష్టం జరిగిందో లేదో స్పష్టత లేని ఆక్వా రైతులకు రూ.90 లక్షల పరిహారం మంజూరు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఓఎన్‌జీసీ అధికారులు వెంటనే తమ సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.




