Rajahmundry: పీజీఆర్ఎస్ అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి: కమిషనర్!
Rajahmundry: పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 15 అర్జీలు అందాయి.సమస్యలకు తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపి ప్రజలకు భరోసా కల్పించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు.
Rajahmundry: పీజీఆర్ఎస్ అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి: కమిషనర్!
రాజమండ్రి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు.
మొత్తం 15 అర్జీలు రాగా వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 9, రెవెన్యూకి సంబంధించి ఒకటి, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 3, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి రెండు ఉన్నాయి. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు. తాత్కాలిక చర్యలతో సమస్యను ముగించకుండా, సమస్య తిరిగి పునరావృతం కాకుండా అవసరమైన శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు.
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అనంతరం గతంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పురోగతిని విభాగాధిపతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను పెండింగ్ లో ఉంచకుండా, నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు.
అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం దరఖాస్తులుగా కాకుండా, నగర పాలనను మరింత మెరుగుపరిచేందుకు వచ్చిన సూచనలుగా పరిగణించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, రెవిన్యూ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.




