Rajahmundry: ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌కు శ్రీకారం

Rajahmundry: రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది.

NARAYANA, RAJANAGARAM
Published on: 11 Jun 2026 5:11 PM IST
Rajahmundry
X

Rajahmundry: ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌కు శ్రీకారం

Rajahmundry: మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీఓ) ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌గా ఇది నిలవబోతుందని ఆమె పేర్కొన్నారు.

మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్‌కు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ దేశ విమానయాన రంగ అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగు అని అన్నారు. సుమారు ఆరు నెలల్లో ఈ శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166కు పెంచిందన్నారు.

ఉడాన్ పథకం ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. గతంలో దేశంలో ఆరు విమానయాన సంస్థలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య తొమ్మిదికి చేరిందని తెలిపారు.

ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ పైలట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా దశల వారీగా సుమారు 500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన శిక్షణ రంగానికి ఇది కొత్త దిశానిర్దేశం చేస్తుందని, రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.

జార్విస్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ ఫణీంద్ర మాట్లాడుతూ రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం ఫ్లైట్ ట్రైనింగ్‌కు అత్యంత అనువైన ప్రదేశమని తెలిపారు. విమానయాన రంగ నిపుణులు, పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ స్థాపించబడిందన్నారు. దేశంలో ప్రస్తుతం శిక్షణ పొందిన పైలట్ల కొరత తీవ్రంగా ఉందని, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు సుమారు 2,000 కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని పేర్కొన్నారు. పరిశ్రమ అంచనాల ప్రకారం రానున్న దశాబ్దంలో 25 వేల నుంచి 30 వేల మంది కొత్త పైలట్ల అవసరం ఏర్పడనుందని తెలిపారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story