Razole: స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలి.. ఎంపీ హరీష్ బాలయోగి!

Razole: రాజోలులో టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం. స్థానిక ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి కూటమి విజయం సాధించాలని పిలుపునిచ్చిన ఎంపీ గంటి హరీష్ బాలయోగి.

PRABHU, RAZOLE
Published on: 13 Sept 2026 3:35 PM IST
Razole
X

Razole: స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలి.. ఎంపీ హరీష్ బాలయోగి!

Razole: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా అంకితభావంతో పనిచేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి పిలుపునిచ్చారు. రాజోలు మండలం శివకోటిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను వాస్తవాలను వివరించడం ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టాలని అన్నారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని విమర్శించిన హరీష్ బాలయోగి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించిందని తెలిపారు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని భావిస్తే విచారణ కమిటీ ముందు ఆధారాలతో నిరూపించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగడం లేదంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎంపీ అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.

మలికిపురం మండలం ఇరుసుమండలో జనవరిలో జరిగిన బ్లో అవుట్ ఘటనలో బాధితులకు ఇప్పటికే నష్టపరిహారం అందించామని చెప్పారు. ఇన్సూరెన్స్ తదితరంగా అందాల్సిన మిగిలిన ప్రయోజనాలను కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

స్థానిక ఎన్నికలు కూటమికి అత్యంత కీలకమని పేర్కొన్న ఎంపీ.. ప్రతి బూత్, ప్రతి గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుని పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కష్టపడి పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో కూటమి విజయ ఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE