Rajahmundry: ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: ఎమ్మెల్యే వాసు!

Rajahmundry: రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) 'మన వార్డులో... మన ఆదిరెడ్డి' కార్యక్రమంలో భాగంగా 3, 4 డివిజన్లలో పర్యటించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 31 July 2026 12:31 PM IST
Rajahmundry
X

Rajahmundry: ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: ఎమ్మెల్యే వాసు!

Rajahmundry: ప్రజల సమస్యలను వినడమే కాదు... ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడమే మా లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. 'మన వార్డులో... మన ఆదిరెడ్డి' కార్యక్రమంలో భాగంగా 3, 4 డివిజన్లలో గురువారం రాత్రి బస చేసిన ఆయన, శుక్రవారం ఉదయం ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాత్రి బస అనంతరం ఉదయం 3, 4 డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఓర్పుగా విన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు, తాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు, విద్యుత్ సమస్యలు, పారిశుద్ధ్యం, కాలువల శుభ్రత తదితర అంశాలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సమస్యను నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ "ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించాలనే ఉద్దేశంతోనే 'మన వార్డులో... మన ఆదిరెడ్డి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది" అని తెలిపారు. ఎమ్మెల్యే వాసు స్వయంగా ఇంటింటికీ వచ్చి సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story