Rajahmundry: విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి.. ఎమ్మెల్యే!

Rajahmundry: నారాయణ కళాశాలలో 'మీ భద్రత.. మా బాధ్యత' కార్యక్రమం. విద్యార్థులు చెడు స్నేహాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి సూచన.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 8 Sept 2026 2:15 PM IST
Rajahmundry
X

Rajahmundry: విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి.. ఎమ్మెల్యే!

Rajahmundry: విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, చదువుతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. విద్యార్థి దశలోనే మంచి విలువలు, నైతికత, క్రమశిక్షణను అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగగలరని ఆయన అన్నారు. మోరంపూడి శ్రీనగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాల వద్ద నిర్వహించిన ‘మీ భద్రత.. మా బాధ్యత’ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చని, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించేందుకు నిరంతరం కష్టపడాలన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించగలడని చెప్పారు. ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో రీల్స్‌ చూస్తూ సమయం వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని, మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని కోరారు. సినిమాల్లో మాదిరిగా నిజజీవితం ఉండదని, ఒకసారి జరిగిన తప్పును సినిమాలా మార్చుకునే అవకాశం జీవితంలో ఉండదన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్‌పై జరిగిన ఒక ప్రమాదాన్ని ఉదాహరణగా చెబుతూ, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివిస్తున్నారని, ఆ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో నేరం జరిగిన తర్వాత నిందితులను గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టేదని, ప్రస్తుతం సీసీ కెమెరాల విస్తృత నిఘాతో నేరం జరిగిన వెంటనే నిందితులను గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. తమను ఎవరూ చూడటం లేదని భావించి తప్పులు చేయవద్దని, ప్రతి చర్యకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇతరులు ఇచ్చే వస్తువులను, ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే ప్యాకెట్లను పరిశీలించకుండా తీసుకెళ్లవద్దని హెచ్చరించారు.

ఒక విద్యార్థికి స్నేహితుడి ద్వారా ఇచ్చిన ప్యాకెట్‌లో డ్రగ్స్ ఉండటంతో ఆమె కూడా కేసులో ఇరుక్కున్న ఘటనను ఉదాహరణగా వివరించారు. తెలియకుండా చేసినా చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేశాయని గుర్తుచేశారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎస్పీ సహకారంతో నియోజకవర్గంలో ‘మహిళా రక్షక్’ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా శక్తి టీమ్స్ కూడా మహిళా కళాశాలల వద్ద ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నప్పుడు ఏం చదివారు..? ఎక్కడి నుంచి వచ్చారు..? అని అడిగితే గర్వంగా ఆంధ్రప్రదేశ్, రాజమహేంద్రవరం అని చెప్పుకునేలా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ముగించారు. అలాగే లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, మహిళా పోలీసు విభాగాలకు చెందిన అధికారులు మాట్లాడుతూ విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల నివారణ, మహిళల రక్షణ, చట్టపరమైన అంశాలపై పలు సూచనలు చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story