Rajahmundry: సేవల పట్ల ప్రజా సంతృప్తే మా లక్ష్యం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
Rajahmundry: ప్రభుత్వ సేవల పట్ల ప్రజా సంతృప్తే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు.
Rajahmundry: సేవల పట్ల ప్రజా సంతృప్తే మా లక్ష్యం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
రాజమండ్రి: మున్సిపల్ కార్పొరేషన్ (ఆర్‌ఎంసీ) పరిధిలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ (సీవీఏపీయూ) కార్యాలయంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మార్గదర్శకత్వంలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, కీలక పనితీరు సూచికలు, తక్కువ పనితీరు కనబరుస్తున్న అంశాలు, ప్రజల సానుకూల అభిప్రాయ నివేదిక, తొలి త్రైమాసిక నియోజకవర్గ ర్యాంకింగ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు, వైద్య ఆరోగ్య, ఇంజినీరింగ్, విద్య, గృహ నిర్మాణం, వసతి గృహాలు, మెప్మా, అన్న క్యాంటీన్లు, మహిళా–శిశు సంక్షేమం తదితర శాఖల పనితీరును సమీక్షించారు. ఆయా శాఖలకు సంబంధించిన ర్యాంకింగ్, పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, వెనుకబడిన సూచికలకు గల కారణాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తక్కువ పనితీరు ఉన్న అంశాలను గుర్తించి, వాటి వెనుక ఉన్న కారణాలను విశ్లేషించి తక్షణమే మెరుగుదల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలకు అందుతున్న సంక్షేమ సేవలు, అన్న క్యాంటీన్ల నిర్వహణ, ఆహార నాణ్యత, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రజల సంతృప్తిని పెంచడంతో పాటు నియోజకవర్గ పనితీరు ర్యాంకింగ్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా అధికారులు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, ఆర్‌ఎంసీ అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. పి. కోమలి, నగర వైద్య ఆరోగ్య అధికారి వినూత్న, పర్యవేక్షక ఇంజినీర్ రీటా, కార్యనిర్వాహక ఇంజినీర్లు మాధవి, మదర్ష అలీ, రెవెన్యూ అధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సీవీఏపీయూ యంగ్ ప్రొఫెషనల్ కె. దుర్గాభవాని,సీవీఏపీయూ సిబ్బంది పాల్గొన్నారు.




