Rajahmundry: ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ!
Rajahmundry: రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
Rajahmundry: ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ!
రాజమండ్రి: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎప్పుడూ ఒంటరివారు కారని, వారి విద్య, అభివృద్ధి, భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రతి అడుగులో అండగా నిలుస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎస్‌కేవీటీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అలవెన్సులు, విద్యా అవకాశాలు, ఆటిజం పిల్లలకు ప్రత్యేక చర్యలు, తల్లిదండ్రులకు అందిస్తున్న సహకారం గురించి వివరించి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమాన విద్యావకాశాలు కల్పించడం, వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన ఉపకరణాలు, ఆర్థిక సహాయం, అలవెన్సులు అందించడంలో పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
గతంలో రూ.3,000గా ఉన్న అలవెన్స్‌ను రూ.6,000కు పెంచి నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఆటిజం ఉన్న చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, రాష్ట్ర ఐటీ... విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రాజమహేంద్రవరం ఇన్నీసుపేటలో ఆటిజం సెంటర్ ప్రారంభించబడిందని చెప్పారు. ఆటిజం ఉన్న పిల్లలకు మెరుగైన విద్య, అవసరమైన పరికరాలు, వారి ప్రతిభను వెలికితీసే అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ఈ అంశంపై ఏర్పాటైన కమిటీలో ఉన్న శాసనసభ్యుడు స్వయంగా ఆటిజం సమస్యను కుటుంబంలో అనుభవిస్తున్న వ్యక్తి కావడంతో మరింత అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందుకు నిదర్శనమన్నారు. సీఎస్‌ఆర్ నిధులను వినియోగించి వారి ప్రతిభను మరింత ప్రోత్సహించగలిగితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
పిల్లలు ఒంటరిగా ఉండకుండా ఏదో ఒక సృజనాత్మక కార్యక్రమంలో పాల్గొంటే వారి ప్రవర్తనలో కూడా సానుకూల మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పిల్లల పట్ల సంపూర్ణ బాధ్యతతో వ్యవహరిస్తోందని పేర్కొంటూ, ఈ సందర్భంగా 45 మంది విద్యార్థులకు సుమారు రూ.3.90 లక్షల విలువైన ఉచిత ఉపకరణాలను అందజేయడం సంతోషకరమన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమం అనంతరం రాజమహేంద్రవరం నియోజకవర్గంలో జరిగే పంపిణీ కార్యక్రమానికి తాను తప్పకుండా హాజరవుతానని, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడతానని చెప్పారు.
గతంలో తల్లిదండ్రులు సదరం సర్టిఫికెట్‌లకు సంబంధించిన ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో చాలావరకు పరిష్కారం లభించిందన్నారు. ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ నెలలో కొత్త దివ్యాంగ పెన్షన్లు మంజూరు కానున్నాయని, పెన్షన్లకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ఎక్కడైనా అడ్డంకులు ఎదురైతే కలెక్టర్‌తో కలిసి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పెంచుతున్న తల్లిదండ్రులు, సంరక్షకులు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారని ఎమ్మెల్యే వాసు భావోద్వేగంగా అన్నారు. సాధారణంగా ఒకటి లేదా ఇద్దరు పిల్లలను పెంచడమే ఎంతో కష్టమని, అలాంటిది ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం జీవితాన్ని అంకితం చేస్తున్న ప్రతి తల్లిదండ్రికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానన్నారు.
"ఈ బంధం దేవుడు కల్పించిన రుణబంధం... ఏ మత గ్రంథాన్ని నమ్మినా ఒక విషయమే చెబుతుంది... ఈ పిల్లలకు సేవ చేసే అదృష్టం మీకు దక్కింది... ప్రభుత్వం తనవంతు బాధ్యత నిర్వర్తిస్తుంది... మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నామనే భావనకు లోనుకావద్దు... ప్రతి అడుగులో ప్రభుత్వం మీతో ఉంటుంది" అని అన్నారు.
ప్రభుత్వ సహాయంతో పాటు తన భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అవసరమైన సమయంలో సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. సిటీ నియోజకవర్గంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌గా రూ.1,56,000, ఎస్కార్ట్ అలవెన్స్‌గా రూ.1,14,000, హోం బేస్డ్ అలవెన్స్‌గా రూ.60,000, బాలికల స్టైపెండ్ అలవెన్స్‌గా రూ.3,12,000 కలిపి మొత్తం 107 మంది లబ్ధిదారులకు రూ.6,42,000 ప్రభుత్వం అందిస్తోందని వివరించారు.
ట్రాన్స్‌పోర్ట్, ఎస్కార్ట్, హోం బేస్డ్, గర్ల్ స్టైపెండ్ అలవెన్సుల ద్వారా పిల్లల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి ఖర్చు ప్రజలకు తెలియజేయడం తమ బాధ్యత అని పేర్కొంటూ, పారదర్శకత (ట్రాన్స్‌పరెన్సీ), జవాబుదారీతనం (అకౌంటబిలిటీ) విషయంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అర్హత ఉండి కూడా అలవెన్సులు అందని వారు వెంటనే సమగ్ర శిక్ష అధికారులను సంప్రదించాలని, అధికారులు సమస్యలను పరిష్కరించి ఎవరూ ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్ష జిల్లా అధికారిణి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.




