Razole: శివకోటిలో నూతన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి!
Razole: రాజోలు మండలం శివకోటిలో నూతన టీడీపీ కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు.
Razole: శివకోటిలో నూతన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి!
రాజోలు: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం, శివకోటి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య, జనసేన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు శివకోటి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ, సంక్షేమంతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామని, తద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
మెగా డీఎస్సీపై ప్రతిపక్షాలకు మాట్లాడే నైతిక హక్కు లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కోర్టుల్లో 260 కేసులు వేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఉపాధి, పెట్టుబడులు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.




