Rajahmundry: ప్రియాంక కేసులో సిఐ కాల్ డేటా బహిర్గతం చేయాలన్న మార్గాని భరత్!

Rajahmundry: రాజమండ్రిలో మెడికో ప్రియాంక ఘోర మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని వైసిపి జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 11 Aug 2026 4:27 PM IST
Rajahmundry
X

Rajahmundry: ప్రియాంక కేసులో సిఐ కాల్ డేటా బహిర్గతం చేయాలన్న మార్గాని భరత్!

Rajahmundry: రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక ఘటనపై సమగ్ర విచారణ జరిపితేనే అన్ని వాస్తవాలు బయటికి వస్తాయని మాజీ ఎంపీ, వైసిపి జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మార్గాని భరత్ రామ్ స్పష్టం చేసారు. ఈనెల 3వ తేదీన ఆమెను కారుతో గుద్ది తీవ్రంగా గాయపరిస్తే 6వ తేదీ వరకు ఎందుకు బయటకు రాకుండా చేసారని ఆయన నిలదీసారు.

స్థానిక విఎల్ పురం మార్గాని ఎస్టేట్స్‌లో ఉన్న వైసిపి సిటీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు విషయంలో ఆయన కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. మూడు రోజుల పాటు ఘటనను ఎందుకు గోప్యంగా ఉంచారు? ఆగస్టు 3న ఘటన జరిగితే ఆగస్టు 6న మాత్రమే అరెస్ట్ ఎందుకు? చూపించారని నిలదీసారు.

నిందితులు పరారీలో ఉన్నారా?, పోలీసు కస్టడీలో ఉన్నారా?.. ఇంత దారుణమైన ఘటనను ప్రమాదంగా ఎందుకు చూపించారు? అని ప్రశ్నించారు. మొదట రాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేసు ఎందుకు నమోదు చేశారు? స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లు ఎందుకు పెట్టారు?, డిఎస్పీ చిన్న యాక్సిడెంట్ అని ఎందుకు చెప్పారో విచారణ చేస్తేనే తేలుతుందన్నారు.

పలుమార్లు ఆమె ప్రయాణిస్తున్న స్కూటిని ఢీకొట్టి, తలపై నుంచి కారు నడిపిన ఘటనలో తీవ్రమైన సెక్షన్లు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. స్థానిక ఎమ్మెల్యే తనకు బాధ్యత లేదన్నట్టుగా ప్రవర్తించారని విమర్శించారు. డాక్టర్ ప్రియాంక విషయంపై ఫేస్ బుక్‌లో నేను పోస్ట్ చేసిన అంశాన్ని ఫేస్ బుక్ మెటాకి పంపించి డిలీట్ చేయించారని ఆరోపించారు.

మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్‌గా కేసును ఎందుకు చూపించారు? డాక్టర్ ప్రియాంక కుటుంబ సభ్యుల వాదనను ఎందుకు పట్టించుకోలేదు?అని ఈ ప్రశ్నలన్నీ వాస్తవం కాదో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అన్నారు. ప్రకాష్ నగర్ పోలీసుల విచారణ తీరుపై కూడా తమకు చాలా అనుమానాలు ఉన్నాయని అవసరమైతే వారిపై కూడా విచారణ జరిపించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా కేసు విచారణ చేస్తున్న సిఐ బాజీ లాల్ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో ఫోన్ కాల్ డేటాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటనపై సోషల్ మీడియా ఎందుకు మౌనంగా ఉంది? రాజమండ్రి సోషల్ మీడియా పేజీలు పోస్టులు ఎందుకు చేయలేదని నిలదీసారు.

కారుతో ఢీకొట్టిన తరువాత ప్రసాదిత్య మాల్ వద్ద నుంచి ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయి, ఏం మాట్లాడారు అన్నది కాల్ డేటా వెల్లడించాలని డిమాండ్ చేసారు. ఘటనను అణిచివేయడానికి రాజకీయ ఒత్తిడి ఉందా?, నిజాలను దాచేందుకు ప్రయత్నం జరిగిందా? ప్రజలకు పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం ప్రియాంక ఘటన సీరియస్‌గా తీసుకోవాలని, రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అసలు వాస్తవాలు బయట పెట్టేవరకు వైసిపి తరపున ప్రియాంక కుటుంబానికి తాము అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి దారుణమైన ఘటనలు జరగకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మార్గాని భరత్ డిమాండ్ చేసారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story