Mamidikuduru: మామిడికుదురు మధ్యలంకలో అరుదైన వలస పక్షుల సవ్వడి

Mamidikuduru: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం మధ్యలంకకు ఐరోపా నుంచి వేలాది ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్స్ (నత్తకొంగలు) తరలివచ్చాయి.

PRABHU, RAZOLE
Published on: 24 Aug 2026 9:00 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: మామిడికుదురు మధ్యలంకలో అరుదైన వలస పక్షుల సవ్వడి

మామిడికుదురు: బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం మధ్యలంకలో అరుదైన వలస పక్షులు సందడి చేస్తున్నాయి. వేలాది ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్‌లు తుమ్మ చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

ఐరోపా ప్రాంతాల నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి ఏటా ఈ పక్షులు మధ్యలంకకు చేరుకుంటున్నాయి. తుమ్మ చెట్లపై గూళ్లు నిర్మించుకుని గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతున్నాయి. గత నాలుగేళ్లుగా ఇదే ప్రాంతాన్ని తమ ఆవాసంగా ఎంచుకుంటున్న ఈ పక్షులు.. పిల్లలు ఎగరగలిగే స్థాయికి వచ్చిన తర్వాత వాటిని వెంట తీసుకుని తిరిగి వలస ప్రాంతాలకు వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు.

గోదావరి నదిలో లభించే నత్తలు వీటికి ప్రధాన ఆహారం. పొడవాటి ముక్కుతో నత్తలను పట్టుకుని తినడం వల్ల స్థానికులు వీటిని ముద్దుగా “నత్తకొంగలు” అని పిలుస్తున్నారు.

తుమ్మ చెట్లకు ఉండే పదునైన ముళ్లు పాములు గూళ్లను చేరుకోకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. విషసర్పాల నుంచి పిల్లలను రక్షించుకునేందుకే ఈ పక్షులు ముళ్లతో కూడిన తుమ్మ చెట్లను ఆవాసాలుగా ఎంచుకుంటున్నాయని పేర్కొంటున్నారు.

వేలాది పక్షులు ఒకేచోట గూళ్లు ఏర్పాటు చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే కిలకిలారావాలతో మధ్యలంక సందడిగా మారింది. వలస పక్షుల రాకతో గోదావరి తీర ప్రాంతానికి మరింత ప్రకృతి సొబగులు అద్దుకున్నాయి.

ఇంత పెద్ద సంఖ్యలో వలస పక్షులు తమ ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. పక్షుల ఆవాసాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని సంరక్షించాలని వారు కోరుతున్నారు. వేలాది వలస పక్షులకు బి.దొడ్డవరం మధ్యలంక సురక్షిత నిలయంగా మారడం పట్ల ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story