Mamidikuduru: కొబ్బరికాయల రాశిలో ఐదు అడుగుల త్రాచుపాము
Mamidikuduru: మామిడికుదురు మండలం బాడిలంకలో కొబ్బరికాయల రాశిలో ఉన్న ఐదు అడుగుల త్రాచుపామును స్నేక్ క్యాచర్ మట్టపర్తి విష్ణు చాకచక్యంగా పట్టుకున్నారు.
Mamidikuduru: కొబ్బరికాయల రాశిలో ఐదు అడుగుల త్రాచుపాము
మామిడికుదురు: మామిడికుదురు మండలం లూటుకుర్రు శివారు బాడిలంకలో గురువారం త్రాచుపాము కలకలం సృష్టించింది. అప్పన పట్టాభి రామయ్య ఇంట్లోని కొబ్బరి కాయల రాశిలో పాము నక్కి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో భయాందోళనకు గురైన ఇంటి యజమాని పాశర్లపూడి కొట్టుమెరకు చెందిన స్నేక్ క్యాచర్ మట్టపర్తి విష్ణుకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న విష్ణు కొబ్బరి కాయల రాశిని జాగ్రత్తగా పరిశీలించి, అందులో నక్కి ఉన్న సుమారు ఐదు అడుగుల పొడవైన త్రాచుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పామును సురక్షితంగా డబ్బాలో బంధించి, జన సంచారం లేని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి విడిచిపెట్టారు.
దీంతో పట్టాభి రామయ్య కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకరమైన పామును ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టిన స్నేక్ క్యాచర్ విష్ణును స్థానికులు అభినందించారు.




