Malikipuram: విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపిన వినాయకుని వినూత్న చిత్రలేఖనం!

Malikipuram: మలికిపురం ప్రముఖ చిత్రకారుడు నల్లి సంగీత్ వినూత్నంగా చంద్రునిపై వినాయకుని చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ప్రదర్శన.

PRABHU, RAZOLE
Published on: 12 Sept 2026 1:08 PM IST
Malikipuram
X

Malikipuram: విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపిన వినాయకుని వినూత్న చిత్రలేఖనం!

Malikipuram: సాంప్రదాయంగా ఎంతో ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి రోజున వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ పవిత్ర దినాన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన శ్రీ వినాయకుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

ఇంతటి విశిష్టత కలిగిన వినాయక చవితి పండుగను పురస్కరించుకుని బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు నల్లి సంగీత్ వినూత్నమైన చిత్రకళాఖండాన్ని రూపొందించారు. వినాయకుడు చంద్రునిపై ఆసీనుడై భక్తులను దీవిస్తున్నట్లుగా ఆయన చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. చిత్రంలో వినాయకుని రూపంతో పాటు పండుగకు సంబంధించిన ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళాకారుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ఈ సందర్భంగా చిత్రకారుడు నల్లి సంగీత్ మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థులకు మన పండుగలు, సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. కళ ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి పట్ల అవగాహన, ఆసక్తి, స్ఫూర్తిని పెంపొందించవచ్చన్నారు.

సంగీత్ రూపొందించిన ఈ అద్భుత చిత్రకళాఖండాన్ని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు ప్రదర్శించారు. చిత్రాన్ని ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు వినాయకుడి రూపకల్పన, చిత్రంలోని భావవ్యక్తీకరణపై ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల మరింత ఆసక్తి, అవగాహన కలిగిందని నిర్వాహకులు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE