Amalapuram: పీజీఆర్ఎస్‌లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్.. కలెక్టర్!

Amalapuram: కోనసీమ జిల్లాలో పీజీఆర్ఎస్ కేంద్రాల్లో 'సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్' ఏర్పాటు. ఆగస్టు 31న అర్జీల స్వీకరణ, వివరాలు వెల్లడించిన కలెక్టర్ మహేష్ కుమార్.

PRABHU, RAZOLE
Published on: 30 Aug 2026 5:23 PM IST
Amalapuram
X

Amalapuram: పీజీఆర్ఎస్‌లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్.. కలెక్టర్!

Amalapuram: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు, వారికి అందుతున్న ప్రభుత్వ సేవలపై అభిప్రాయాలను తెలుసుకుని పరిపాలనా వ్యవస్థను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా పీజీఆర్ఎస్‌ను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.

సోమవారం (ఆగస్టు 31) జిల్లావ్యాప్తంగా పీజీఆర్ఎస్ (రెవెన్యూ క్లినిక్) కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లాలోని అన్ని పీజీఆర్ఎస్ కేంద్రాల్లో ‘పీజీఆర్ఎస్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పీజీఆర్ఎస్ కేంద్రంలో సేవ పొందిన అనంతరం ప్రజలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమకు అందిన సేవలపై అభిప్రాయాలను నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి అందే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

అన్ని కేంద్రాల్లో అర్జీల స్వీకరణ

జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పీజీఆర్ఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

1100కు ఫోన్.. వాట్సాప్‌లోనూ సేవలు

పీజీఆర్ఎస్ కేంద్రాలకు స్వయంగా రాలేని ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్, మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా 300కు పైగా పౌర సేవలను పొందే అవకాశం ఉందని వెల్లడించారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారికి అందుతున్న ప్రభుత్వ సేవలపై వారి అభిప్రాయాలను కూడా పాలనలో భాగస్వామ్యం చేయడం ద్వారా మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన ప్రజా సేవలను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story