Konaseema: ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తులను విధిగా స్వీకరించాలి

Konaseema: కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తులను సెప్టెంబర్ 16 వరకు స్వీకరించాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

SURESH, AMALAPURAM
Published on: 8 Sept 2026 6:09 PM IST
Konaseema
X

Konaseema: ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తులను విధిగా స్వీకరించాలి

కోనసీమ: కోనసీమ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరి దరఖాస్తు తప్పకుండా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.సోమవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని డివిజన్ మండల స్థాయి అధికారులతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ,విధానం, అవగాహన వంటి అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో గత సంవత్సరం వ్యవదీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రతి సోమవారం సుమారుగా 240 పెన్షన్లు దరఖాస్తులు స్వీకరణ జరిగేదని వాటిని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు చేపట్టాలన్నారు.జిల్లాలో అర్బన్,రూరల్ సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఫిర్యాదుదారుడు ఇచ్చిన దరఖాస్తులు తప్పకుండా స్వీకరించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలియజేశారు.

అంతేకాకుండా ప్రజాప్రతినిధుల ద్వారా "ప్రజా దర్బార్ "నుండి వచ్చే దరఖాస్తులను పరిశీలనలో తీసుకుని ఎంపీడీవోలు, ఏపిఎంలు,మున్సిపల్ కమిషనర్లు సమన్వయం చేసుకోవాలన్నారు.జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

జిల్లాలో అన్ని సచివాలయ పరిధిలో ఉన్న కాట్రేనికోన,రామచంద్రాపురం,కే గంగవరం,రావులపాలెం మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లను ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ అవగాహన వంటి అంశాలను అడిగి ఎటువంటి అంతరాయం జరగకుండా అప్రమత్తం చేసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లకు దరఖాస్తుల గడువు కొత్తగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి సెప్టెంబర్‌ 7 నుంచి 16వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్‌ తెలిపారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో గ్రామ,వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు నిరంతరం అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ సూచించారు.లబ్ధిదారులు సమర్పించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ఉన్నవారి దరఖాస్తులు సకాలంలో ప్రాసెస్‌ అయ్యేలా చూడాలన్నారు.అకారణంగాదరఖాస్తులను తిరస్కరించరాదు.

పత్రాలు లేవనే కారణంతో అర్హులైన దరఖాస్తు దారులను వెనక్కి పంపడం,దరఖాస్తులను అకారణంగా తిరస్కరించడం చేయరాదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.సాంకేతిక సమస్యలు, ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన లోపాలు లేదా ఇతర ఆధారాల కొరత ఉన్నట్లయితే వాటిని సంబంధిత వ్యవస్థలో నమోదు చేసి, నిబంధనల మేరకు తదుపరి ప్రక్రియ చేపట్టాలని సూచించారు.చిన్నచిన్న కారణాలతో ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పకుండా,సమస్యలను సాధ్యమైనంత వరకు సంబంధిత స్థాయిలోనే పరిష్కరించాలని ఆదేశించారు.

అవసరమైన ధ్రువీకరణ పత్రాల పింఛన్‌ కేటగిరీకి అనుగుణంగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుదారులు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు.వయోవృద్ధుల పింఛన్‌కు ఆధార్‌,వితంతువుల పింఛన్‌కు మరణ ధ్రువీకరణ పత్రం,దివ్యాంగుల పింఛన్‌కు సదరం సర్టిఫికేట్‌ అవసరమని పేర్కొన్నారు.అలాగే ఒంటరి మహిళలు తహసీల్దార్‌ జారీ చేసే వివాహ స్థితి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా నేత కార్మికులు,మత్స్యకారులు, చేనేత కళాకారులు తదితర వృత్తి ఆధారిత పింఛన్‌ కేటగిరీలకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత శాఖలు జారీ చేసే అర్హత/ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్‌ వివరించారు. లబ్ధిదారులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తహసీల్దారులు తమ పరిధిలోని అర్హులైన దరఖాస్తుదారులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతంగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సచివాలయ సిబ్బంది అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.సెప్టెంబర్‌ 16వ తేదీ చివరి గడువు కావడంతో అర్హులైన వారు గడువులోగా దరఖాస్తు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.

ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి డి రాంబాబు,స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి వి.విజయలక్ష్మి, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డ్ కోఆర్డినేషన్ అధికారి సువిజయ్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story