Konaseema: కోనసీమలో నకిలీ తనిఖీల కలకలం: అవాక్కయిన అంగన్వాడీ సిబ్బంది!

Konaseema: కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో ఇప్సోస్ సంస్థ పేరుతో అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు చేసి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

PRABHU, RAZOLE
Published on: 8 Sept 2026 9:47 AM IST
Konaseema
X

Konaseema: కోనసీమలో నకిలీ తనిఖీల కలకలం: అవాక్కయిన అంగన్వాడీ సిబ్బంది!

Konaseema: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఇప్సోస్ సంస్థ పేరుతో పలు అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం ముగ్గురు వ్యక్తులు పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. సఖినేటిపల్లి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన వారిలో ఒకరు తను కరీం గా పరిచయం చేసుకుని, తాను ఇప్సోస్ సంస్థ ఇన్‌చార్జినని చెప్పినట్లు అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. అంగన్వాడీ పిల్లలకు ఐరన్ సిరప్ ఎంత మోతాదులో ఇవ్వాలో కూడా ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.

అనంతరం అంగన్వాడీ టీచర్ దేవి, ఆశా వర్కర్ విజయలను విచారణ పేరుతో బెదిరించి రూ.3,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో భయపడిన వారు రూ.1,000 ఇచ్చి పంపించినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని అంగన్వాడీ టీచర్ దేవి అంగన్వాడీ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడంతో మిగిలిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే శృంగారప్పాడు, అంతర్వేది గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఇదే వ్యక్తులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

సఖినేటిపల్లి ఎస్సై హరికోటి శాస్త్రి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story