Amalapuram: తాగునీటి పథకం పనులను వేగంగా పూర్తి చేయాలి కలెక్టర్

Amalapuram: కోనసీమ సెంట్రల్ డెల్టా తాగునీటి పథకం పనులను 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశం.

PRABHU, RAZOLE
Published on: 23 July 2026 8:23 PM IST
Amalapuram
X

Amalapuram: తాగునీటి పథకం పనులను వేగంగా పూర్తి చేయాలి కలెక్టర్

అమలాపురం: బొబ్బర్లంక– అంతర్వేది ఫేజ్-1 తాగునీటి పథకం పనులను సత్వరమే పూర్తి చేయాలని డాక్టర్ .బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతినిధులతో కలిసి కోనసీమ సెంట్రల్ డెల్టా వాటర్ గ్రిడ్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన కోనసీమ సెంట్రల్ డెల్టా తాగునీటి పథకం పనులు నిర్ణీత గడువులో పూర్తి కావాలని సూచించారు. సుమారు రూ.740 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు జిల్లాలో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

బొబ్బర్లంక వద్ద గోదావరి నుంచి ముడి నీటిని తీసుకుని, వసంతవాడలో నిర్మిస్తున్న 75 ఎంఎల్‌డీ సామర్థ్యమున్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో శుద్ధి చేసి, అక్కడి నుంచి బొబ్బర్లంక నుంచి అంతర్వేది వరకు ఫేజ్-1 పరిధిలోని ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసేలా పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

పైప్‌లైన్లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, పంపింగ్ స్టేషన్లు, ఓవర్‌హెడ్ రిజర్వాయర్లు తదితర అనుబంధ నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 2027 ఏప్రిల్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

పనుల అమలులో ఎదురయ్యే సాంకేతిక, భూసేకరణ, విద్యుత్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించి ఎలాంటి జాప్యం లేకుండా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు ప్రాజెక్టు పురోగతిని వివరించి, మిగిలిన పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

సమావేశంలో కొత్తపేట ఆర్‌డీవో సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ రాజన్, ఆర్ అండ్ బి ఈఈ రాము, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, డ్రైన్స్ ఎస్ఈ కిషోర్, ఎంఈఐఎల్ ప్రతినిధి శ్యామ్, జిల్లా వైద్య శాఖ అధికారి దుర్గారావు, సమాచార పౌరసంబంధాల అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story