Ambajipeta: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ముమ్మరం

Ambajipeta: కోనసీమ జిల్లా అంబాజీపేటలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పాస్ పుస్తకాల పంపిణీ, రైతులతో ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు.

RAJU, P GANNAVARAM
Published on: 8 Sept 2026 4:07 PM IST
Ambajipeta
X

Ambajipeta: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ముమ్మరం

​అంబాజీపేట: కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తుండటంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. సీఎం పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.

ఎస్పీ రాహుల్ మీనా నేతృత్వంలో సుమారు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దగ్గరుండి ప్రజావేదిక, కార్యకర్తల సమావేశ వేదికల పనులను పర్యవేక్షిస్తున్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజన ఏర్పాట్లతో సహా అన్ని రకాల వసతులు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

​రేపు ఉదయం 10.30 గంటలకు ఇరుసుమండ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకునే సీఎం, అక్కడి నుండి రోడ్డు మార్గాన జయంతినగర్‌కు వెళ్తారు. చాలాకాలంగా నం. 22A నిషేధిత భూముల జాబితాలో ఉండి ఇబ్బందులు పడుతున్న 30 కుటుంబాలకు ఊరట కలిగిస్తూ ప్రత్యక్షంగా భూహక్కులు కల్పించనున్నారు. అనంతరం పండువారిపేట ప్రజావేదిక వద్దకు చేరుకుని, రైతులతో ముఖాముఖిగా మాట్లాడతారు.

అక్కడే ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శించి, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బుడుంగపేటలో నిర్వహించే తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత హెలిపాడ్‌కు చేరుకుని ఉండవల్లికి ప్రయాణమవుతారు. సీఎం రాకతో కోనసీమ వ్యాప్తంగా పండుగ ఉత్సాహం కనిపిస్తోంది.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story