Amalapuram: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత జాయింట్ కలెక్టర్!

Amalapuram: కామనగరువులో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వై. నైడియా దేవి. పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకంపై అవగాహన.

SURESH, AMALAPURAM
Published on: 22 Aug 2026 4:31 PM IST
Amalapuram
X

Amalapuram: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత జాయింట్ కలెక్టర్!

Amalapuram: కామనగరువులో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.

మా ఇల్లు - మా కుటుంబం - మన జిల్లా జాగృతమై పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్.నైడియా దేవి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

శనివారం అమలాపురం మండలం కామన గరువు గ్రామపంచాయతీలోని స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రత నిర్వహణపై మాట్లాడారు. అనంతరం గ్రామపంచాయతీ పరిధిలో మొక్కలు నాటి స్వచ్ఛ సర్వేక్షన్ లో పలు కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, పరిశుభ్రత అనేది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై.ఖోమ్. నైడియా దేవి పేర్కొన్నారు.

జిల్లాలోని పరిసరాల పరిశుభ్రత కావాలంటే ప్రతి ఒక్కరూ మా ఇల్లు - మా కుటుంబం- మన జిల్లా ఆత్మ పరిశీలన చేసుకుని చెత్త సేకరణ పై దృష్టి సారించాలన్నారు.మన కుటుంబంలోని మన ఇల్లును ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన జిల్లాను కూడా అంత శుభ్రంగా ఉంచే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెత్త సేకరణను చేసి ప్రజలలో ఒకరికి ఒకరు చెత్త నిర్మూలనపై కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ గ్రామాలు పరిశుభ్రత అనేది ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని,ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన గ్రామాలను నిర్మించగలమని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం,రోడ్ల పక్కన వ్యర్థాలను పడవేయడం,కాలువల్లో చెత్త వేయడం వంటి చర్యలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు.తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పంచాయతీ సిబ్బందికి అందించాలని తెలిపారు.

ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే పరిశుభ్రమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పరిశుభ్రతను ఒక కార్యక్రమంగా కాకుండా నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.గ్రామంలోని ప్రతి కుటుంబం పరిశుభ్రతపై అవగాహన కలిగి,తమ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, అధికారులు,పంచాయతీ సిబ్బంది,పారిశుధ్య కార్మికులతో పరిసరాల పరిశుభ్రతపై స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛమైన గ్రామాలు, స్వచ్ఛమైన మండలాలు, స్వచ్ఛమైన జిల్లాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.గ్రామాల్లో పారిశుధ్యంపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచాలని అధికారులకు సూచించారు.

‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ గ్రామ పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటారు.పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత రెండూ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.మొక్కల పెంపకంతో గ్రామాల్లో పచ్చదనం పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి అనంతరం గ్రామంలో పారిశుధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులతో జాయింట్ కలెక్టర్ నేరుగా మాట్లాడారు.

గ్రామంలో ప్రతిరోజూ చేపడుతున్న చెత్త సేకరణ విధానం, తడి–పొడి చెత్త వేర్పాటు, చెత్త తరలింపు, పారిశుధ్య నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని,అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

గ్రామంలో చెత్త సేకరణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.గ్రామ ప్రజలకు పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత,వ్యర్థాల నిర్వహణపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా,ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని కోరారు.

ప్రతి ఇంటి నుంచి మార్పు రావాలి ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి శాంతి కుమారి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్ని జిల్లా పంచాయతీలో బహిరంగ ప్రదేశాలలో శానిటేషన్ కార్యక్రమం ఎప్పటికప్పుడూ నిర్వహిస్తూ ఉన్నామని, మన జిల్లాలో జలాలను పవిత్రంగా పూజిస్తామని ఆమె తెలిపారు. అటువంటి జలాలను అపరిశుభ్రత కాకుండా పరిరక్షణ చేయాలని కోరారు.

ముఖ్యంగా చెరువులు కాలువలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వెయ్యడం వలన రసాయన వియోగం చెంది భవిష్యత్తు తరాలకు క్యాన్సర్, మానసిక వైకల్యం,అంగవైకల్యం కలిగే అవకాశం ఉన్నందున భావితరాలను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని ఆమె తెలిపారు.పరిశుభ్రత విషయంలో ప్రతి కుటుంబం బాధ్యత తీసుకుంటే గ్రామాల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు.

ఇంటి పరిసరాల్లో చెత్త వేయకుండా, వ్యర్థాలను నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి వనరులను కలుషితం చేయకుండా చూడడం వంటి చర్యలను ప్రజలు అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం లక్ష్యాలను గ్రామ స్థాయిలో విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అమలాపురం డి ఎల్ డి ఓ విజయభాస్కర్, అమలాపురం తాసిల్దార్ దివాకర్ సర్పంచ్, పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story