Razole: బ్లోఅవుట్ హామీలు ఏమయ్యాయి?: ఆగ్రహం వ్యక్తం చేసిన లక్కవరం వాసులు!
Razole: మలికిపురం ఇరుసుమండ బ్లోఅవుట్ సమయంలో ఓఎన్‌జీసీ, డీప్ ఇండస్ట్రీస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ లక్కవరం గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Razole: బ్లోఅవుట్ హామీలు ఏమయ్యాయి?: ఆగ్రహం వ్యక్తం చేసిన లక్కవరం వాసులు!
రాజోలు: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం ఇరుసుమండ బ్లోఅవుట్ ఘటన సందర్భంగా డీప్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లక్కవరం గ్రామస్థులు డిమాండ్ చేశారు. హామీల అమలులో వివక్ష చూపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
మలికిపురం మండలం లక్కవరం–ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో ఈ ఏడాది జనవరి 5న జరిగిన భారీ బ్లోఅవుట్‌తో లక్కవరం, ఇరుసుమండతో పాటు సమీపంలోని మరో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటన అనంతరం బ్లోఅవుట్‌ను అదుపులోకి తీసుకుని, వెల్‌ను పూర్తిగా మూసివేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలకు పలు హామీలు ఇచ్చారు.
ప్రతి కుటుంబానికి రూ.10 వేల నష్టపరిహారం, 50 కేజీల బియ్యం, రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌తో పాటు లక్కవరం గ్రామంలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. అయితే రూ.10 వేల నష్టపరిహారం అందించినప్పటికీ, రెండు రోజుల క్రితం 50 కేజీల బియ్యాన్ని కేవలం ఇరుసుమండ గ్రామస్థులకు మాత్రమే పంపిణీ చేయడం పట్ల లక్కవరం వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హామీలు కాగితాలకే పరిమితమా?
లక్కవరం గ్రామానికి చెందిన కొడవటి దొరబాబు మాట్లాడుతూ.. బ్లోఅవుట్ సమయంలో ఇచ్చిన హామీలను అందరికీ సమానంగా అమలు చేయాలని కోరారు. లక్కవరం సహా మిగిలిన గ్రామాల కుటుంబాలకు కూడా 50 కేజీల బియ్యం అందించాలని, రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే లక్కవరం గ్రామంలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. బ్లోఅవుట్ సమయంలో ఇచ్చిన హామీలను అధికారులు, ఓఎన్జీసీ, డీప్ ఇండస్ట్రీస్ యాజమాన్యం, ప్రజాప్రతినిధులు ఇకనైనా పూర్తిస్థాయిలో అమలు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




