Rajole: రాజోలు నియోజకవర్గంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు!

Rajole: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాజోలు నియోజకవర్గంలో భారీ వర్షాలు.. శివకోటిలో పిడుగుపాటుకు దగ్ధమైన ఇల్లు, సిలిండర్ పేలుడు.

PRABHU, RAZOLE
Published on: 12 Sept 2026 12:21 PM IST
Rajole
X

Rajole: రాజోలు నియోజకవర్గంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు!

Rajole: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శనివారం తెల్లవారుజాము నుంచి రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతం కావడంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది. భారీ శబ్దాలతో పిడుగులు పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

రాజోలు మండలం శివకోటి గ్రామంలో శనివారం ఉదయం పిడుగుపాటుకు చిట్టూరి శ్రీనివాస్‌కు చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే పిడుగుపాటుతో ఇంట్లో మంటలు చెలరేగి, అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమై, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, సామగ్రి కాలిబూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో బాధిత కుటుంబానికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. పిడుగులు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE