Anakapalli: రూ.115 కోట్లతో అనకాపల్లికి తాగునీటి పైప్‌లైన్: జీవీఎంసీ కమిషనర్
Anakapalli: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అనకాపల్లి నుంచి జోనల్ స్థాయి PGRSను ప్రారంభించారు.
Anakapalli: రూ.115 కోట్లతో అనకాపల్లికి తాగునీటి పైప్‌లైన్: జీవీఎంసీ కమిషనర్
అనకాపల్లి, ఆగస్టు 17: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో జీవీఎంసీ జోన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం తొలిసారిగా అనకాపల్లి జోన్‌లో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్వయంగా PGRS నిర్వహించారు.
ఇకపై ప్రతి సోమవారం జీవీఎంసీ పరిధిలోని పది జోన్లలో ఏదో ఒక జోన్‌లో PGRS నిర్వహించి, ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కమిషనర్ తెలిపారు.
అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి, వివిధ విభాగాల అధికారులతో కలిసి నిర్వహించిన PGRSలో మొత్తం 11 అర్జీలు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్-4, ఇంజనీరింగ్-3, రెవెన్యూ-2, పబ్లిక్ హెల్త్-1, UCD-1 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ పన్నులు, ఆక్రమణలు, తాగునీటి సరఫరా, హౌస్ పట్టాలు, కారుణ్య నియామకాలు, జలవనరుల్లో పూడికతీత తదితర సమస్యలను ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి అర్జీదారుడితో నేరుగా మాట్లాడిన కమిషనర్.. సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. గతవారం PGRSలో వచ్చిన అర్జీల పరిష్కార పురోగతిని కూడా సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
రూ.115 కోట్లతో తాగునీటి పైప్‌లైన్
వచ్చే ఏడాదితో అనకాపల్లి మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అనకాపల్లి అభివృద్ధి, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేతన్ గార్గ్ తెలిపారు. ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు రూ.115 కోట్లతో అగనంపూడి నుంచి అనకాపల్లికి నీటి సరఫరా పైప్‌లైన్ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
అలాగే ప్రతి ఇంటికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ అందించే దిశగా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
డంపింగ్ యార్డు, పారిశుద్ధ్యంపై ఫోకస్
అనకాపల్లిలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని కమిషనర్ ఆదేశించారు. అవసరమైన పారిశుద్ధ్య కార్మికులు, వ్యర్థాల తరలింపు వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాధికారులు వారంలో రెండు రోజుల పాటు అనకాపల్లిలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
PGRSపై అధికారులకు కీలక ఆదేశాలు
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న PGRSలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న కమిషనర్, ప్రభుత్వం సూచించిన PGRS Audit మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారి అర్జీదారుడితో నేరుగా మాట్లాడాలని, అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్య పరిష్కరించిన అనంతరం ఫొటోలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఒకే సమస్యపై పునరావృత ఫిర్యాదులు రాకుండా వాస్తవ పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, PGRS సమయంలో జోనల్ కమిషనర్లు, సంబంధిత విభాగాధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
మట్టి గణపతులనే వినియోగించాలి
వినాయక చవితి నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై కూడా కమిషనర్ కీలక సందేశం ఇచ్చారు. వినాయక ఉత్సవ నిమజ్జనోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా, కమిషనర్ కేతన్ గార్గ్ నిర్వాహకులను అభినందించారు.
ప్రతి ఒక్కరూ వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలనే వినియోగించి పర్యావరణహితంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాలకు దూరంగా ఉండి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీర్లు కె. శ్రీనివాసరావు, తిరుమలరావు, కార్యనిర్వాహక ఇంజనీర్లు శేఖర్, గోపాలకృష్ణ, డీసీపీ మధుసూదన్‌రావు, ఏఎంఓహెచ్ లక్ష్మీ తులసి, టీపీఓ ప్రవీణ్, రెవెన్యూ అధికారి నాయుడు తదితరులు పాల్గొన్నారు.




