Konaseema: విశ్వబ్రాహ్మణులకు 50 ఏళ్లకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వాలి: సూర్యనారాయణ
Konaseema: 50 ఏళ్లు దాటిన విశ్వబ్రాహ్మణులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వాలని, ప్రత్యేక సంక్షేమ ప్యాకేజీ ప్రకటించాలని డబ్ల్యూపీఐ అధ్యక్షుడు దేవాదుల డిమాండ్ చేశారు.
Konaseema: విశ్వబ్రాహ్మణులకు 50 ఏళ్లకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వాలి: సూర్యనారాయణ
కోనసీమ జిల్లా: విశ్వబ్రాహ్మణులకు 50 ఏళ్లకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వాలి డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 50 సంవత్సరాలు దాటిన ప్రతి విశ్వబ్రాహ్మణుడికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించాలని వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను,కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారని తెలిపారు.తరతరాలుగా వడ్రంగి,స్వర్ణకార,కంచరి,కమ్మరి, శిల్పి తదితర కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న విశ్వబ్రాహ్మణులు ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆధునిక యంత్రాలు,కార్పొరేట్ సంస్థలు,మార్కెట్‌లో పెరిగిన పోటీ కారణంగా సంప్రదాయ కులవృత్తులకు ఆదరణ తగ్గిపోయి,వేలాది కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వృత్తి నైపుణ్యం ఉన్నప్పటికీ వయస్సు పెరిగిన తర్వాత పనులు లభించకపోవడంతో అనేక మంది విశ్వబ్రాహ్మణులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సూర్యనారాయణ మూర్తి తెలిపారు.ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వృత్తిదారులకు స్థిరమైన ఆదాయం లేకపోవడం,వృద్ధాప్య భద్రత లేకపోవడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారుతోందన్నారు.
ఎన్నికల సమయంలో 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కనీసం ఇప్పటికీ వరకు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరమన్నారు.ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేసి విశ్వబ్రాహ్మణుల పట్ల కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.
ఇతర వెనుకబడిన వర్గాల వృత్తిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలు,పెన్షన్ వంటి ప్రయోజనాలను విశ్వబ్రాహ్మణులకు కూడా సమానంగా అందించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం,ఆర్థిక సమానత్వం అనే లక్ష్యంతో 50 సంవత్సరాలు దాటిన విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
రాజకీయ పార్టీలకు విశ్వబ్రాహ్మణులను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా,వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణమూర్తి సూచించారు.రాష్ట్ర అభివృద్ధిలో విశ్వబ్రాహ్మణుల కృషి ఎంతో ఉందని, వారి వారి సంప్రదాయ వృత్తులను కాపాడేందుకు విశ్వబ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి ప్రత్యేక సంక్షేమ ప్యాకేజీ ప్రకటించాలని, 50 సంవత్సరాలు దాటిన వారందరికీ ఎటువంటి వివక్ష లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించేలా ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




